తెలంగాణ(Telangana) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొండా సురేఖ మంత్రివర్గ బర్తరఫ్ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన మంత్రి పదవి భర్తీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద ట్విస్ట్‌గా మారాయి.
సురేఖ(Konda Surekha)పై వేటు వేసింది పూర్తిగా హైకమాండ్ నిర్ణయమేనని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆమెను కాపాడేందుకు లేదా చర్యలు ఆపేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నాలు జరిగినా, ఢిల్లీ పెద్దలు ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పడంతో ఈ సంచలన నిర్ణయం అమలైందన్నారు. ఏఐసీసీ వైఖరితో స్థానిక నేతల ప్రయత్నాలు కూడా ఫలించలేదని ఆయన పరోక్షంగా అంగీకరించారు.
అయితే, కొండా సురేఖ నిష్క్రమణతో ఖాళీ అయిన స్థానంలో కొత్తవారికి ఎప్పుడు అవకాశం దక్కుతుందనే దానిపై మాత్రం పీసీసీ చీఫ్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఢిల్లీ స్థాయి నుంచి కేబినెట్ విస్తరణపై ఎలాంటి ఆదేశాలు రాలేదని, మంత్రివర్గాన్ని ఎప్పుడు పెంచాలనే పూర్తి అధికారాలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతిలోనే ఉన్నాయని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు, రేసులో తన పేరు వినిపిస్తుండటంపై స్పందిస్తూ తనకు అలాంటి సమాచారం ఏదీ లేదని కొట్టిపారేశారు. మొత్తానికి, సురేఖ ఎపిసోడ్ తర్వాత క్యాబినెట్ విస్తరణ ఇప్పుడప్పుడే లేదనే సంకేతాలు వస్తుండటంతో ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.