ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్, సీనియర్ రాజకీయ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyannapatrudu) తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు తనదైన శైలిలో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ, నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన.. సడన్‌గా క్రియాశీల రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యారు.
నర్సీపట్నం(Narsipatnam)లో అత్యంత ఉత్సాహంగా సాగుతున్న తన జన్మదిన వేడుకల వేదికపైనే అయ్యన్న ఈ షాకింగ్ ప్రకటన చేశారు. వయసు మీద పడటంతో పాటు, ఇకపై రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలని భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ తాను ఇకపై పోటీ చేయబోనని తేల్చిచెప్పడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అయితే, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ.. ప్రజలకు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని అయ్యన్న(Ayyanna) తెలిపారు. స్పీకర్‌గా తనకు మిగిలి ఉన్న మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికే అంకితం చేస్తానని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి, నర్సీపట్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే తన పూర్తి ఫోకస్ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఏటా పుట్టినరోజు నాడు రక్తదాన శిబిరాలు నిర్వహించే తన సంప్రదాయాన్ని ఈసారీ కొనసాగించి మంచి మనసు చాటుకున్నారు.
మరోవైపు, అయ్యన్న పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటన హాట్ టాపిక్‌గా మారిన తరుణంలోనే.. నర్సీపట్నంలో బీసీ రాజకీయాలు కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో జరగబోయే 'బీసీ ఐక్య వేదిక సదస్సు'పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న 34 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు టీడీపీ(TDP) నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తానికి, అయ్యన్న సంచలన నిర్ణయం, నర్సీపట్నం పాలిటిక్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ కేక్‌లా మారాయి.