వైసీపీ హయాంలో నాటి పాలకులు తరిమేసిన అనేక పెట్టుబడులు, పరిశ్రమలను తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి రాబడుతోంది. పాలనను గాడిలో పెట్టిన కూటమిసర్కారు.. ప్రస్తుతం మరింత ఎక్కువగా పెట్టుబడుల విషయంపై దృష్టి పెడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా మంత్రి లోకేస్ కేరళ రాష్ట్రంలో అమృతపురిని సందర్శించారు. మాతా అమృతానందమయిని కలుసుకున్నారు. ``అమ్మా మీరు రండి మేమున్నాం. మీకు అన్ని విధాలా సహకరిస్తాం. గతాన్ని మరిచిపోండి`` అని విజ్ఞప్తి చేశారు.
ఏం జరిగింది?
మాతా అమృతానందమయికి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో `అమృత` విద్యాసంస్థలు ఉన్నాయి. జాతీయ, అంతర్జా తీయ స్థాయిలో ఈ సంస్థలు విద్యను బోధిస్తాయి. సాంకేతిక, వైద్య, ఇంజనీరింగ్ తదితర కీలక రంగాలకు సంబం ధించిన విద్యాసంస్థలను మాతా అమృతానందమయి.. నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రతిభకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తారు. ప్రభుత్వాల నుంచి పెద్దగా ఏమీ ఆశించరు. కానీ, ఆయారాష్ట్రాల్లో పేదలకు మాత్రం విద్యా సేవ చేయడంలో వెనుకాడరు.
ఈ విషయాన్ని గ్రహించిన సీఎం చంద్రబాబు 2015-17 మధ్య అమృత విద్యాసంస్థలకు.. రాజధాని అమరావతిలో భూములు కేటాయించారు. అమృత విశ్వవిద్యాలయం స్థాపనకు ఆయన ప్రోత్సహించారు. అప్పట్లో చంద్రబాబు స్వయంగా అమృతానందమయితో మాట్లాడి ఆమెను ఒప్పించి.. అమరావతికి తీసుకువచ్చారు. వీరు భూమిని కొనుగోలు చేశారు.కానీ, శంకుస్థాపన తర్వాత.. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అక్కడి నుంచి పతనం ప్రారంభమైంది. దీంతో ఆ స్థలాన్ని అలానే వదిలేసి.. అమృతానందమయి.. మిన్నకున్నారు.
తాజాగా అమృత విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తిరిగి రావాలని కోరుకుంటున్న ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేష్ మాతను కలిశారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను.. తమ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కూడా వివరించారు. అమరావతిలో తిరిగి సంస్థను నిలబెట్టాలని.. విశాఖలో సాంకేతిక విశ్వవిద్యా లయం ఏర్పాటుచేయాలని కోరారు. మళ్లీ వచ్చేది కూటమి సర్కారేనని మాతకు భరోసా ఇచ్చారు. వాస్తవానికి.. రాజకీయాలకు.. వివాదాలకు దూరంగా ఉండే అమృత సంస్థలు.. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. మొత్తంగా జగన్ హయాంలో తరిమేసిన సంస్థలను ఒక్కొక్కటిగా తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.