2024 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ తిరిగి పుంజుకున్నారా ? అంటే.. ఇంకా ప్రయత్నాల్లో నే ఉన్నారన్న సమాధానం వినిపిస్తోంది. 2024 శాసనసభ ఎన్నికలలో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు జగన్ గ్రాఫ్‌పై భిన్నమైన చర్చలకు దారితీస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్లకపోవడం, రాజధాని విషయంలో అదే మంకుపట్టుదలతో వ్యవహరించడం వంటివి భారీ మైనస్‌కు కారణమవుతున్నాయి.
ఇక, క్షేత్రస్థాయిలోను, పార్టీ పరంగాను.. జగ న్ బలానికి సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్న ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. క్యాడర్‌లో స్థైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఓటమి తర్వాత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు జగన్ నిరంతరం తాడేపల్లి కార్యాలయంలో, అలాగే పులివెందుల పర్యటనల్లో నేతలతో 'ప్రజా దర్బార్' నిర్వహిస్తూ సమీక్షలు జరుపుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఒక సవాల్‌గా తీసుకున్నారు.
ప్రతి స్థానంలోనూ వైసీపీ అభ్యర్థులు పోటీ చేయాలని జగన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదేసమయంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని, నిరుద్యోగ భృతి, విద్యా దీవెన బకాయిల వంటి అంశాలను జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సర్వేలలో జగన్ ప్రజాదరణ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందని చెప్పడం గమనార్హం.
గత ఐదేళ్ల తన పాలనలోని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కోల్పోయిన బలాన్ని తిరిగి సాధించాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే, ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవడం తక్షణమే సాధ్యం కాకపోయినా, కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ జగన్ రాజకీయంగా పుంజుకునేందుకు గట్టిగానే శ్రమిస్తున్నారు. మొత్తంగా ఈ రెండున్నరేళ్లలో జగన్ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.