ప్యార‌డైజ్‌కు కాన్పిడెన్స్ ఇస్తున్న లెనిన్‌?

admin
Published by Admin — September 06, 2026 in Movies
News Image

ఒక‌ప్పుడు ఒక‌సారి విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన సినిమాకు డేట్ మారుస్తుంటే.. మేక‌ర్స్ చాలా ఇబ్బంది ప‌డిపోయేవారు. సినిమా వాయిదా ప‌డ‌డాన్ని నెగెటివ్‌గా చూసేవారు. ప్రేక్ష‌కుల దృష్టికోణం కూడా అలాగే ఉండేది. సినిమా బాగా ఆల‌స్యం అయినా, రిలీజ్ డేట్ మ‌ళ్లీ మ‌ళ్లీ మారినా.. ఆ మూవీ స్టేల్ అయిన‌ట్లు భావించేవారు. కానీ కొవిడ్ పుణ్య‌మా అని ఈ ఆలోచ‌న విధాన‌మే మారిపోయింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా వాయిదాల మీద వాయిదాలు ప‌డ‌డం.. రిలీజ్ డేట్లు మ‌ళ్లీ మ‌ళ్లీ మార్చుకోవ‌డం మామూల‌పోయింది. 

క‌రోనా క‌థ కంచికి చేరినా.. ఇండ‌స్ట్రీ జ‌నాల తీరు మార‌లేదు. సినిమాల మేకింగ్‌లో మ‌రింత ఆల‌స్యం చేస్తున్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ రిలీజ్ డేట్లు మారుస్తున్నారు. ఐతే ఇదంతా ఔట్ పుట్ బాగుండ‌డం కోస‌మే అంటారు. సినిమా ఆల‌స్యం అయిన‌పుడు, డేట్లు మార్చిన‌పుడు ప్రేక్ష‌కుల నుంచి అస‌హ‌నం వ్య‌క్త‌మైనా, అంతిమంగా ఔట్ పుట్ బాగుంటే అంతా మ‌రిచిపోయి సినిమాను ఆద‌రిస్తార‌న్న‌ది వారి న‌మ్మ‌కం.

కొన్ని నెల‌ల ముందు లెనిన్ సినిమాను ఇలాగే మ‌ళ్లీ మ‌ళ్లీ వాయిదా వేస్తుంటే.. బాగా నెగెటివ్ కామెంట్లు వ‌చ్చాయి సోష‌ల్ మీడియాలో. అయినా టీం ఏమీ ప‌ట్టించుకోకుండా సినిమాను కొంచెం లేటుగానే ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చింది. అంతిమంగా లెనిన్ మంచి విజ‌యం సాధించ‌డంతో అంత‌కుముందున్న నెగెటివిటీ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ది ప్యార‌డైజ్ మూవీకి అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా రెండుసార్లు వాయిదా ప‌డింది. మార్చి చివ‌రి వారం, ఆగ‌స్టు మూడో వారం.. నుంచి వాయిదా ప‌డి సెప్టెంబ‌రు 24కు ఫిక్స‌యింది. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా ఖాయం కాదంటున్నారు. 

24వ తేదీకి సినిమాను రెడీ చేయ‌డం క‌ష్ట‌మ‌ని, బాగా హ‌డావుడి అయిపోతుంద‌ని.. అందుకే ఇంకో ఒక‌టి రెండు వారాలు ఆల‌స్యంగా రిలీజ్ చేద్దామ‌ని టీం ఆలోచిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. యుఎస్ నుంచి తిరిగి రానున్న నాని విడుద‌ల తేదీ విష‌యంలో తుది నిర్ణ‌యిం తీసుకుంటాడ‌ని అంటున్నారు. అక్టోబ‌రు 2 నుంచి ఆద‌ర్శ కుటుంబం వాయిదా ప‌డుతుండ‌డంతో నాని మూవీని కాస్త‌ పోస్ట్ పోన్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ద‌క్కుతోంది. మ‌ళ్లీ వాయిదా అనేస‌రికి నాని ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. లెనిన్ సినిమా విష‌యంలో ఏం జ‌రిగిందో తెలిసిందే కాబ‌ట్టి.. కొంచెం లేటైనా బెస్ట్ ఔట్‌పుట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తే అంతా స‌ర్దుకుంటుంద‌ని టీం ఆలోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

Tags
Paradise gaining confidence from lenin
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News