చంపడానికైనా.. చావ‌డానికైనా సిద్ధ‌మ‌ట‌ .. కాస్త ఓవ‌ర్‌గా లేదూ..!

admin
Published by Admin — September 09, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో స్థానిక సంస్థల సమరసింహనాదం మోగడంతో రాజకీయ వేడి ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పోరు కావడంతో ఇరుపక్షాలూ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే, గెలుపు కోసం పార్టీలు పన్నే వ్యూహాలు ఒకెత్తయితే.. నేతల మాటల దాడి మాత్రం రాజకీయ హద్దులను దాటి హింసను ప్రేరేపించే స్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

కుప్పంలో రగిలిన "రక్త" రాజకీయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ కార్యకర్తల సమావేశం వేదికగా ఎమ్మెల్సీ భరత్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో 'చంపడానికైనా.. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం' అని బహిరంగంగా ప్రకటించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. నామినేషన్ వేస్తేనే సగం గెలిచినట్లేనని చెప్తూ.. రక్తాభిషేకం చేసైనా సరే విజయం సాధిస్తామనడం వాతావరణాన్ని తీవ్రంగా వేడెక్కించింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా పోరాడటం న్యాయమే కానీ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బహిరంగంగా "చంపడం, చావడం" అంటూ మాట్లాడటం కాస్త ఓవర్ గానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ఘాటు కౌంటర్.. వరుస ఫిర్యాదులు
ఈ వ్యాఖ్యలపై కుప్పం(Kuppam) టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్షేత్రస్థాయిలో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకక, ఓటమి భయంతోనే వైసీపీ నేతలు కార్యకర్తలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రశాంతమైన కుప్పంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ భరత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరుతూ రామకుప్పం, రాళ్లబూదుగూరు పోలీసు స్టేషన్లలో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు.

మరోవైపు ఎమ్మెల్సీ భరత్(MLC Bharat) చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లో ఉన్న ఒక ప్రజాప్రతినిధి చట్టాన్ని, శాంతిభద్రతలను గౌరవించాల్సింది పోయి రౌడీయిజం, హింసను ప్రోత్సహించేలా మాట్లాడటం ఏమాత్రం తగదని ఖండిస్తున్నారు. ఓటు హక్కుతో ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు చెప్పాలి తప్ప, రక్తాభిషేకాలు, చంపడాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Tags
AP Local Elections Kuppam YSRCP TDP AP Politics Chandrababu Naidu YCP MLC Bharat Andhra Pradesh AP News
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News