టీడీపీలో చిన్న శ్రీనుకు కీల‌క బాధ్య‌త‌లు..!

admin
Published by Admin — October 10, 2026 in Politics, Andhra
News Image

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడైన మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను(Chinna Srinu) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న కొద్దిరోజులకే అదిరిపోయే ఆఫర్ దక్కింది. గిరిజన ప్రాబల్యం అత్యధికంగా ఉన్న అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరిశీలకుడిగా చిన్న శ్రీనును నియమించారు.  ఆయనకు అప్పగించిన ఈ బాధ్యతలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

అరకు పార్లమెంట్  పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన భారీ బాధ్యత ఇప్పుడు చిన్న శ్రీను భుజస్కంధాలపై పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా శ్రేణులను సన్నద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ నియామకం సాగింది.

సొంతగూటికి గుడ్‌బై చెప్పి పచ్చ పార్టీలో అడుగుపెట్టిన చిన్న శ్రీను దూకుడు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో ఆయన పాత్ర మరింత కీలకం కానుందని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandra Babu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యూహాత్మక అడుగుల్లో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం వేసిన మాస్టర్ ప్లాన్‌లో చిన్న శ్రీనుకు పెద్ద పీఠం వేసినట్లయింది.

కాగా, పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిన్న శ్రీను స్పందిస్తూ.. చంద్రబాబు దార్శనికత, నాయకత్వ శైలిపై నమ్మకంతోనే తాను టీడీపీ(TDP)లో చేరినట్లు స్పష్టం చేశారు. అరకు ప్రాంత అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుపుకుంటూ సమన్వయంతో ముందుకు వెళ్తామని, పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి, కొత్త పార్టీలో అడుగుపెట్టిన నెల రోజుల్లోనే కీలక పదవిని దక్కించుకున్న చిన్న శ్రీను, తనను నమ్మి అప్పగించిన బాధ్యతలను ఏ విధంగా నెరవేరుస్తారు? ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags
Chinna Srinu Araku TDP Observer AP Politics Andhra Pradesh TDP CM Chandrababu
Recent Comments
Leave a Comment

Related News