ఏపీ(AP)లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. సార్వత్రిక సమరం ముగిసి రెండున్నరేళ్లు కావస్తుండటంతో, ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీల వరకు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే, ఎన్నికల ప్రక్రియ మొదలవుతున్న కొద్దీ మైదానంలో కనిపిస్తున్న రాజకీయ చిత్రపటం మాత్రం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు ఎన్నికల కోసం కూటమి వేగంగా అడుగులు వేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ వైఖరి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం అదే జోరును స్థానిక పోరులోనూ(AP Local Body Elections) కొనసాగించాలని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ఎన్నికలను ఒక సువర్ణావకాశంగా భావిస్తోంది. సంక్షేమ పథకాల అమలు, పాలనాపరమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, వార్డు స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. నాయకులు, కార్యకర్తలను ఇప్పటికే సమాయత్తం చేస్తూ సమరానికి సిద్ధమనే సంకేతాలను స్పష్టంగా పంపుతోంది.
మరోవైపు వైసీపీ(YCP) వ్యూహం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. మైకుల ముందుకు వచ్చి "యుద్ధానికి సిద్ధం", "రప్ప రప్ప రాజకీయం చేస్తాం" అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆచరణ మాత్రం దానికి భిన్నంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూనే, మరోవైపు ఎన్నికల నిర్వహణను నిలువరించేందుకు కోర్టు మెట్లు తొక్కడం వెనుక అసలు వ్యూహం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయంలో ఓటమికి 'ఈవీఎంల(EVM)' కారణాన్ని చూపినట్టే, ఇప్పుడు స్థానిక సమరంలో ఏవైనా తేడాలు వస్తే దానికి న్యాయపరమైన చిక్కులు, లేదా పాలనాపరమైన వైఫల్యాలను కారణాలుగా చూపేందుకు ముందస్తు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాజకీయ వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం నియోజకవర్గ ఇంచార్జ్‌ల భవిష్యత్తు. స్థానిక ఎన్నికల ఫలితాల బాధ్యతను వైఎస్ జగన్ దాదాపు పూర్తిగా స్థానిక నాయకులపైనే నెట్టేశారనే ప్రచారం బలంగా సాగుతోంది.
గెలిస్తే అధినేత ఇమేజ్, పార్టీ పట్టు కారణమని క్రెడిట్ పైస్థాయికి వెళ్తుంది. అదే ఓడితే స్థానిక ఇంచార్జ్‌ల వైఫల్యమేనంటూ వారినే బోనెక్కించే అవకాశం ఉంది.ఈ పరిస్థితుల్లో, కూటమి వేగాన్ని తట్టుకుని నిలబడటం క్షేత్రస్థాయి వైసీపీ నాయకులకు పెద్ద సవాలుగా మారింది. అధినేత నుంచి లభించే మద్దతు ఎంతవరకు ఉంటుంది? రేపు ఫలితాలు తేడా వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనే భయం ఇంచార్జ్‌లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా, లోకల్ వార్(Local War) కూటమి వర్సెస్ వైసీపీ మధ్య కాకుండా.. కూటమి ఉత్సాహానికి, వైసీపీ అంతర్గత సవాళ్లకు మధ్య జరుగుతున్న పోరాటంగా మారింది. ఒకపక్క గెలుపు గుర్రాన్ని ఎక్కేందుకు కూటమి శ్రమిస్తుంటే, మరోపక్క గెలుపు-ఓటముల బాధ్యతల బ్యాలెన్సింగ్ గేమ్‌లో వైసీపీ కొట్టుమిట్టాడుతోంది. ఈ స్థానిక సమరంలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.