ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల(AP Municipal Elections) వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. ప్రశాంతంగా సాగాల్సిన నామినేషన్ల ప్రక్రియ తొలి రోజే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు, హింసాత్మక ఘటనలకు వేదికైంది. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల పర్వం.. మొదటి రోజే ప్రత్యర్థుల మధ్య ఆధిపత్య పోరుగా మారి భయానక వాతావరణాన్ని తలపించింది. ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు రాబోయే ఎన్నికల రోజులపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించే పుంగనూరు మున్సిపాలిటీలో నామినేషన్ల దాఖలు సమయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ(TDP), వైసీపీ వర్గాల నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా నామినేషన్ కేంద్రానికి పోటెత్తడంతో తోపులాట మొదలైంది. ఇది కాస్తా క్షణాల్లో పరస్పర దాడులకు దారితీసింది. ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో పాటు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టేందుకు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనతో పట్టణంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
మరోవైపు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సొంత నియోజకవర్గమైన రాయచోటిలోనూ హింస చెలరేగింది. స్థానిక వైసీపీ(YCP) కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి, ఆవరణలో నిలిపి ఉంచిన నాలుగు కార్లకు నిప్పుపెట్టారు. వైసీపీ ఇంచార్జి శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా ప్రత్యర్థుల పనేనని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు తిరుపతిలోనూ ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
నామినేషన్ల స్వీకరణకు కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులందరూ ఒకేసారి నామినేషన్లకు తరలిరావడం ఈ ఘర్షణలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తొలి రోజే మున్సిపల్ రాజకీయం(Municipal Politics) ఇంతటి హింసాత్మక రూపు దాల్చడం చూస్తుంటే.. రానున్న రోజుల్లో ప్రచారం, పోలింగ్ ఏ స్థాయిలో ఉంటాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుని శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురాకపోతే, పాత కక్షలు మళ్లీ తెరపైకి వచ్చే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తున్నారు.