ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక సంచలనం చోటుచేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ తనదైన శైలిలో అత్యున్నత పోలీస్ అధికారులలో ఒకరిగా సేవలందించి, వివాదాలు, సంచలనాల నడుమ పదవీ విరమణ చేసిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేవలం సాధారణ రాజకీయ ప్రవేశమే కాకుండా, నేరుగా విజయవాడ నగరపాలక సంస్థ (VMC) మేయర్ పీఠం కోసం ఆయన బరిలో దిగుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కొద్దికాలంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఘాటైన విశ్లేషణలు చేస్తూ, భవిష్యత్తులో కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తారనే సంకేతాలు ఇస్తూ వచ్చిన ఏబీవీ, అనూహ్యంగా స్థానిక సమరంలోకి దిగడం రాజకీయ పరిశీలకులకే విస్మయం కలిగించింది. విజయవాడ మేయర్(Vijayawada Mayor) స్థానానికి కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు కలిసి సంయుక్తంగా ఆయనను తమ అభ్యర్థిగా ఆహ్వానించాయి. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు లెఫ్ట్ పార్టీల ముఖ్య నేతలు స్వయంగా ఆయనకు మద్దతు ప్రకటించడంతో, ఏబీవీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీల పరంగా పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, వ్యూహాత్మకంగా ఆయన ఇండిపెండెంట్గా ఈ ఎన్నికల పోరును ఎదుర్కోవాలని నిర్ణయించుకోవడం విశేషం.
ఏబీవీ ఎంట్రీతో బెజవాడ మేయర్ పీఠం కోసం జరగనున్న పోరు ఒక్కసారిగా రసవత్తరంగా, త్రిముఖ పోరులా మారిపోయింది. అధికార కూటమి తరఫున జనసేన(Janasena) పార్టీ నుంచి బలమైన నేత వంగవీటి రాధా బరిలో నిలవగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తరఫున మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య సాగే నువ్వానేనా పోరులో.. ఇప్పుడు రిటైర్డ్ డీజీపీ స్థాయి అధికారి, నిక్కచ్చిగా వ్యవహరించే ఏబీవీ రాకతో సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోలీస్ శాఖలో సుదీర్ఘ అనుభవం, పరిపాలనపై గట్టి పట్టు ఉన్న ఏబీవీ(ABV).. విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని చెబుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మేయర్ బరిలో నిలుస్తున్నానని, ప్రజలు తన వెంటే ఉండి చారిత్రక విజయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నామినేషన్ ఘట్టానికి భారీగా తరలిరావాలని శ్రేయోభిలాషులను కోరడంతో బెజవాడ రాజకీయం వేడెక్కింది.