రాజకీయాల్లో సైద్ధాంతిక ప్రయాణం వేరు, అధికార సాధన వ్యూహాలు వేరు. ఈ రెండింటి మధ్య సమతౌల్యం కుదిరినప్పుడే ఏ రాజకీయ పార్టీ అయినా సుస్థిరంగా నిలదొక్కుకోగలదు. కానీ, సరిగ్గా ఇక్కడే జనసేన పార్టీ ఒక సంక్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఆవిర్భవించి పన్నెండేళ్లు పూర్తవుతున్నా, క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన నాయకత్వ వనరులను తయారుచేసుకోవడంలో ఎందుకు వెనుకబడుతోంది? ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల(Muncipal Elections) వేళ తెరపైకి వస్తున్న వలసల పర్వం, ఎరువు తెచ్చుకున్న నేతలకే పదవుల కట్టబెట్టడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
కూటమి రాజకీయాల లెక్కల్లో భాగంగా జనసేన ఆశించిన దానికంటే మెరుగైన స్థానాలనే సాధించింది. రెండు కార్పొరేషన్లు, 20 మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం ద్వారా పార్టీ బలాన్ని చాటుతున్నప్పటికీ, ఆ విజయాల వెనుక వినిపిస్తున్న గొంతుకలు మాత్రం పార్టీకి అంతర్గతంగా పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. ఎందుకంటే, పార్టీకి కేటాయించిన రెండు మేయర్ సీట్లలో ఒకటి టీడీపీ(TDP) నుంచి వచ్చిన వంగవీటి రాధాకు కేటాయించగా, 20 చైర్మన్ పదవులలో మెజార్టీ సంఖ్యలో స్థానాలను సైతం ఇతర పార్టీల నుంచి వచ్చిన మాజీ నేతలకే అప్పగిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో సాలూరు వంటి మున్సిపల్ చైర్మన్ పదవులను వైసీపీలో ఉన్న నాయకులకు కేటాయించడం తీవ్ర చర్చకు దారితీసింది. దశాబ్ద కాలంగా పార్టీ జెండా మోసి, కష్టకాలంలోనూ అండగా నిలబడిన కార్యకర్తలకు పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కకపోవడం అసంతృప్తికి ప్రధాన కారణమవుతోంది. దశాబ్దపు ప్రయాణం తర్వాత కూడా సొంత అభ్యర్థుల కొరత వేధిస్తోందనే విమర్శలు కేడర్‌ను మానసికంగా కుంగదీస్తున్నాయి.
అయితే ఈ సంక్షోభానికి మూలాలు కేవలం ఎన్నికల వేళ తీసుకునే నిర్ణయాల్లోనే లేవు. పార్టీ విస్తరణపై గత కొన్నేళ్లుగా సరైన కార్యాచరణ లేకపోవడం, కేడర్‌కు తగిన రాజకీయ శిక్షణనిచ్చి నాయకులుగా ఎదిగే అవకాశాలు కల్పించడంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు రాగానే వేరే పార్టీల నుంచి ప్రముఖులను లేదా బలమైన నాయకులను నేరుగా పార్టీలోకి ఆహ్వానించి, కీలక పదవులు కట్టబెట్టే ధోరణి ఆచరణాత్మకంగా కొన్ని సీట్లు తెచ్చిపెట్టవచ్చు. కానీ, ఇది దీర్ఘకాలంలో పార్టీ మూలాలను బలహీనపరుస్తుంది. పార్టీ కోసం రక్తంధార పోసిన కార్యకర్తలను పక్కనబెట్టి, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరిస్తే, పార్టీ ఆశయాలైన పారదర్శకత, యువతకు రాజకీయ ప్రాతినిధ్యం అనే నినాదాలకు అర్థం లేకుండాపోతుంది.
ఇది కేవలం నాయకత్వ లోపం మాత్రమే కాదు, రాజకీయ ప్రాధాన్యతల మధ్య ఉన్న అగడ్తను సూచిస్తుంది. అధికారం అంతిమ లక్ష్యమైనప్పుడు ఇలాంటి రాజీలు అనివార్యమని కొందరు వాదిస్తుండవచ్చు. కానీ, కేడర్ నమ్మకాన్ని కోల్పోయి, కేవలం వలస నేతల భుజాల మీద ఆధారపడితే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. జనసేన(Janasena) అధిష్టానం ఈ విచిత్ర పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం గెలుపు సమీకరణాల కోసం తాత్కాలిక సర్దుబాట్లు చేయడం కంటే, క్షేత్రస్థాయిలో సొంత నాయకులను తయారుచేసే బలమైన పునాదిని నిర్మించకపోతే, ఆ పార్టీ ఆశయాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం లేకపోలేదు.