రెబల్స్ కు చంద్రబాబు వార్నింగ్!

admin
Published by Admin — October 20, 2026 in Andhra
News Image

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబల్‌గా పోటీ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తిరుగుబాటు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, కూటమి అధికారిక అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు.

అభ్యర్థుల ఎంపిక, ప్రచారం జనసేన, బీజేపీలతో సమన్వయంతో సాగాలని దిశానిర్దేశం చేశారు. సాధారణ ఎన్నికల్లో సాధించిన ఫలితాల కంటే మెరుగైన విజయం స్థానిక ఎన్నికల్లో సాధించాలని ఆకాంక్షించారు. టీడీపీ పోటీ చేస్తున్న 11 కార్పొరేషన్లను 11 వేర్వేరు సామాజిక వర్గాలకు కేటాయించినట్లు వెల్లడించారు. 

పార్టీ అధికారిక అభ్యర్థులకు బీ-ఫారాలు సకాలంలో అందజేయాలని, రెబల్స్‌పై వేటు తప్పదని స్పష్టం చేశారు. కూటమిగా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు స్వతంత్ర నామినేషన్లు సరికాదని, మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. టికెట్లు దక్కని కార్యకర్తలకు భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను కేవలం పార్టీ అధ్యక్షుడిగానే వ్యవహరిస్తానని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యకర్తలుగా పని చేయాలని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 57 శాతం స్ట్రైక్ రేట్‌ను మించి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

Tags
TDP supremo Chandrababu warns rebels AP Local Body Elections
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News