టీడీపీతో ఆ కుటుంబానికి 40 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. పార్టీ ఆవిర్భావ సమయంలో అంటే.. 1982లోనే టీడీపీ జెండా పట్టుకుని ప్రజల మధ్యకు వచ్చిన గుండ అప్పల నరసయ్య(ఇప్పుడు లేరు) కుటుంబం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీతోనే కలిసి ప్రయాణించింది. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి గుండ అప్పల నరసయ్య ఆరు సార్లు వరుసగా అంటే.. 30 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా సైకిల్ గుర్తుపై గెలుపు గుర్రం ఎక్కారు. ఏడాది కిందటే ఆయన మృతి చెందారు.
అయితే.. ఆయన జీవించి ఉన్నప్పుడే.. అప్పలనరసయ్య సతీమణి గుండ లక్ష్మీదేవి.. యాక్టివ్ అయ్యారు. ఆమె కూడా.. 2014లో విజయం దక్కించుకుని.. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే.. తాజాగా ఆమె టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 40 ఏళ్లుగా టీడీపీలో పనిచేసి పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని గుండ లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. తాను ఎవరిని విమర్శించడం లేదని.. పార్టీ తమకు ఎన్నో సార్లు అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. పార్టీ పట్ల విధేయత ఎప్పటికీ ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
రాజీనామా ఎందుకు?
ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం మేయర్ పీఠాన్ని గుండ లక్ష్మీదేవి ఆశించారు. అయితే .. పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కాకుండా జనసేనకు కేటాయించారు. వాస్తవానికి ఎన్నికల ప్రకటన రాక ముందు నుంచి కూడా లక్ష్మీదేవి దీనిపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ చుట్టూ తిరిగారు. ఎన్ని కల్లో ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతానని కూడా ఆమె ప్రకటించారు. అయితే.. ఇదే సీటును తమకు ఇవ్వాలని జనసేన పట్టుబట్టడంతో టీడీపీకి సాధ్యం కాలేదు. ఈ పరిణామాలతో ఆవేదనకు గురైన లక్ష్మీదేవి వెంటనే రాజీనా మా ప్రకటించారు.
వైసీపీ ఎంట్రీ..
గుండ లక్ష్మీదేవి రాజీనామా వెనుక వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారన్న ప్రచారం జరుగుతోం ది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో రెండున్నర దశాబ్దాలుగా ధర్మాన వర్సెస్ గుండ కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. అయినప్పటికీ.. తాజాగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో గుండ లక్ష్మీదేవిని.. వైసీపీలోకి ఆహ్వానించే ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో వైసీపీ జెండా ఎగురవేయాలన్న ఉద్దేశంతో ఆమెను ఆహ్వానిస్తున్నారని సమాచారం. ఏదేమైనా.. గుండ కుటుంబం పార్టీ కి రాజీనామా చేయడంతో టీడీపీ కొంత మేరకు డ్యామేజీ ఖాయమని అంటున్నారు.