రప్పా.. రప్పా.. అంటూ సమాజంలో అశాంతి, అల్లర్లకు కారణమవుతున్నవారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరా దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసులకు మరిన్ని అధికారాలు ఇచ్చే విషయంపై పరిశీ లన చేస్తున్నట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రాజకీయ నేరస్తులకు రక్షణ కల్పించవద్దని ఆయన తేల్చి చెప్పారు. పోలీసుల అమరవీరుల దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మహిళలను వేధించే వారికి అఘాయిత్యాలు చేసే వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు. ``మా పాలనలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం. ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లో తెలు సుకునే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చాం. మహిళలకు.. దిశ యాప్ ద్వారా.. పోలీసులు పది నిమిషాల్లోనే కాపాడుతున్నారు. ప్రస్తుతం నేరాల సంఖ్య తగ్గడంతోపాటు.. నేరాలు సైతం అదుపులోకి వచ్చాయి.`` అని బాబు అన్నారు. అయితే.. నేరస్థుల విషయంలో దర్యాప్తు పద్ధతి మారాలని సూచించారు.
అధునాతన సాంకేతిక వ్యవస్థ వచ్చిన తర్వాత.. మారుతున్న దర్యాప్తు రీతులను ఏపీపోలీసులు కూడా అందిపుచ్చు కోవాలని చంద్రబాబు సూచించారు. అలాగని రాజకీయ నేరస్థులకు రక్షణ కల్పించకూడదని తేల్చిచెప్పారు. సమాజంలో అల్లర్లు సృష్టిస్తామంటే కుదరదన్నారు. ఇటీవల జరిగిన పుంగనూరు, రాయచోటి, దర్శి అల్లర్లను పరోక్షంగా ప్రస్తావించిన చంద్రబాబు.. హింసకు తావులేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య యుతంగా సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. అలాకాదని తెగబడితే బుద్ధి చెబుతామన్నారు.
ఇక, సోషల్ మీడియాలో బద్నాం చేసేవారు పెరుగుతున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు సోషల్ మీడియా సైకోలను కూడా వదిలిపెట్టొద్దని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులపై అవహేళన చేసే వ్యాఖ్యలను సహించేది లేదన్నారు. పోలీసులకు గత ప్రభుత్వం సెలవులు ఇవ్వకుండా వేధించిందని.. తాము వచ్చిన తర్వాత వారాంతపు సెలవులు తీసుకునే అంశాన్ని పరిశీలించి న్యాయం చేశామన్నారు. పోలీసుల రిక్రూమెంట్ కూడా జరుగుతోందని తెలిపారు.