ఆర్నబ్ తుఫాను పోయినా.. ఎన్నికల తుఫాను ఏపీని కుదిపేస్తోంది. గత నాలుగు రోజుల వరకు తుఫాను, వర్షాల ప్రభావంతో పార్టీల నాయకులు, కార్యకర్తలు కొంత మేరకు మౌనంగా ఉన్నప్పటికీ.. తాజాగా వర్షాలు తగ్గుముఖం పట్టడం.. పరిస్థితి చక్కబడుతుండడంతో నాయకులు ప్రచారంపై దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీ లు, కార్పొరేషన్లలో ఎన్నికల పోలింగ్ ఆదివారం(నవంబరు 1) జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడనుంది.
నవంబర్ 1న పోలింగ్ జరుగుతుండగా, 3న కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు 36,351 మందితో భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటీవల నామినేషన్ల దాఖలు సమయంలో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచడం గమనార్హం. సీసీ కెమెరాలు, పోలీస్ బృందాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే జిల్లాల్లో.. స్థానికేతర నేతలు, కార్యకర్తలు.. ఉండకూడదన్న ఆదేశాలు కూడా వచ్చాయి.
పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఉద్రిక్తతంగానేఉందని పోలీసులు చెబుతున్నారు. తుఫాను కారణంగా ప్రచారానికి మూడు రోజుల పాటు విరామం రావడం.. కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రచారానికి గడువు ఉన్న నేపథ్యంలో నాయకులు పెద్ద ఎత్తున శుక్రవారం ఉదయం నుంచే ప్రచారానికి రంగంలోకి దిగారు. టీడీపీ కూటమి నాయకులు, వైసీపీ నేతలు సహా స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతాయో నన్న పరిస్థితిపై చర్చ అయితే జరుగుతోంది. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
తాయిలాలకు..
ఇక, ఎన్నికలు ఏవైనా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులుతమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం 1న ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మద్యం, నాన్ వెజ్ పంపిణీ చేయాలని కొందరు నేతలు అంచనా వేసుకున్నారు. అయితే.. కొన్ని చోట్ల ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఇక, విజయవాడ, కర్నూలు, విశాఖ, తిరుపతి వంటి కీలక ప్రాంతాల్లో ఓటుకు 1000 నుంచి 1500 చొప్పున పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగా సాగుతోంది.