ఏపీలో సంభవించిన ఆర్నబ్ తుఫాన్ అనంతరం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. నాలుగు రోజులుగా తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ చేయడమే కాకుండా.. టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్పరెన్స్‌లు, క్షేత్ర స్థాయి పర్యటనలతో తుఫాన్ సవాళ్లను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. దీనికి ముందు కూడా పరిస్థితిపై ఆయన సమీక్షించారు.
విద్యుత్, రహదారులు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణలో పురోగతిని చంద్రబాబు తెలుసుకున్నారు. విద్యుత్ పునరుద్దరణలో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి సహకారం తీసుకుని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంకా ఇబ్బందులున్న ప్రాంతాల్లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావానికి గురైన ప్రతి ప్రాంతంలోనూ చిట్ట చివరి వ్యక్తికీ సహాయం అందే వరకూ విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. ప్రతిశాఖలో గ్రామ స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలను తెలుసుకున్నారు.
సీఎం స్వయంగా క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడుతుండటంతో యుద్ధ ప్రాతిపదికన పనులు ముందుకు సాగుతు న్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకున్న చంద్రబాబు ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పనిచేయడాన్ని అభినందించారు. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థల పునరుద్ధరణతో ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు వివిధ శాఖలు క్షేత్రస్థాయిలో పనులు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
విద్యుత్ సరఫరా నిలిచిన 5,404 గ్రామాల్లో 4,881 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు. సుమారు 90 శాతం గ్రామాల్లో విద్యుత్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిన గ్రామాలన్నింటికీ సరఫరా పునరుద్ధరించారు. తీవ్ర ప్రభావం పడిన కోనసీమలో 316 గ్రామాలకు గాను 87 గ్రామాల్లో, పశ్చిమ గోదావరిలో 318 గ్రామాలకు గాను 154 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించారు. ఈ రెండు జిల్లాల్లోనే ఇంకా 393 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించాల్సి ఉంది.
మొబైల్ సమాచార సేవల పునరుద్ధరణలోనూ పురోగతి కనిపించిందని చంద్రబాబు తెలిపారు. వివిధ సంస్థలకు చెందిన 1,045 ప్రభావిత మొబైల్ టవర్లలో 661 పునరుద్ధరించారు. మరో 384 టవర్ల పునరుద్ధరణ మిగిలి ఉందన్నా రు. రహదారులపై కూలిన మొత్తం 2,270 చెట్లను తొలగించారు. ఒక్క కోనసీమ జిల్లాలోనే 1,334 చెట్లను తొలగించి రహదారులపై అడ్డంకులను తొలగించారు. తుఫాను కారణంగా 2,425.45 కిలోమీటర్ల దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రహదారులను పునరుద్ధరించే పనులు చేపట్టారు.
సమర్థనీటి నిర్వహణ..
సమర్థ నీటి నిర్వహణతో రిజర్వాయర్లలో 4.68 టీఎంసీల నీరు అదనంగా చేరింది. మరో 5–6 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉంది. చిన్న నీటిపారుదల చెరువుల్లోకి 22 టీఎంసీల నీరు చేరింది. మరో 8–12 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉంది.భూగర్భ జలాలు 44 టీఎంసీల మేర పెరిగాయని చంద్రబాబు వివరించారు. రాబోయే ఐదు రోజుల ప్రవాహ అంచనాల్లో గొట్టా బ్యారేజీకి 16.24 టీఎంసీలు, మడ్డువలసకు 12.01 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందన్నారు.