వైసీపీకి గుడ్‌బై.. సాయిరెడ్డి కొత్త పార్టీలోకి సీనియర్‌ నేత!

admin
Published by Admin — November 10, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస పరిణామాలు షాకింగ్ ఇస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పార్టీని వీడుతున్న నేతల సంఖ్య పెరుగుతుండగా, తాజాగా ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుడు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కేవలం రాజీనామా చేయడమే కాకుండా, తనకున్న అన్ని పదవులకు కూడా తక్షణమే గుడ్‌బై చెప్పారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయభాస్కర్ రెడ్డి వైసీపీ(YCP) అంతర్గత వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసే నిజమైన కార్యకర్తలను, నాయకులను పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. జగన్(YS Jagan) తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు, శ్రేణుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యమే తనలాంటి సీనియర్లు బయటకు రావడానికి ప్రధాన ప్రేరేపకాలని స్పష్టం చేశారు. అధినేతకు, కష్టపడే కార్యకర్తలకు మధ్య కొందరు వ్యక్తులు ఒక అడ్డుగోడలా మారి తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. కేవలం భజన బృందం, కోటరీ రాజకీయాల జోరు పెరగడం వల్లే పార్టీ ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని విశ్లేషించారు.

ముఖ్యంగా మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేరును ప్రస్తావిస్తూ విజయభాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పెత్తనం చెలలాయించిన సజ్జలే నేడు వైసీపీ పతనానికి, జగన్‌కు ఎదురవుతున్న రాజకీయ ఇబ్బందులకు అసలు సూత్రధారి అని విమర్శించారు. ఆయన అనుసరించిన విధానాల వల్లే పార్టీలో సీనియర్లు ఇమడలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై స్పందిస్తూ.. టీడీపీ(TDP), జనసేన, బీజేపీ కూటమి ఇదే ఐక్యతను కొనసాగిస్తే, భవిష్యత్తులో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని కుండబద్దలు కొట్టారు. 

ఇక వైసీపీకి రాజీనామా చేసిన తక్షణమే విజయభాస్కర్ రెడ్డి(Annapareddy Vijaya Bhaskar Reddy) తన తదుపరి రాజకీయ గమ్యస్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైన ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో ప్రారంభించబోయే నూతన రాజకీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ అనూహ్య పరిణామం ఏపీ రాజకీయాల్లో ఇటు వైసీపీ వర్గాల్లోనూ, అటు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్న వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎలాంటి కీలక మార్పులకు నాంది పలుకుతాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Tags
Annapareddy Vijaya Bhaskar Reddy YSRCP YS Jagan AP Politics Andhra Pradesh Vijaysai Reddy
Recent Comments
Leave a Comment

Related News