కన్నడ ఫిలిం ఇండస్ట్రీ అగ్ర కథానాయకుల్లో ఒకడైన శివరాజ్ కుమార్ గత ఏడాది క్యాన్సర్ బారిన పడడం ఆయన కుటుంబం, అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. శివరాజ్ కుమార్ తండ్రి రాజ్ కుమార్ యాక్టివ్‌గా ఉండగానే చనిపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తే.. కొన్నేళ్ల కిందటే పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా చనిపోవడం ఇంకో పెద్ద షాక్. అలాంటిది మరి కొన్నేళ్లకే కుటుంబానికి పెద్ద దిక్కుగా, అభిమానుల ఆశాజ్యోతిగా ఉన్న శివరాజ్ కుమార్‌కు క్యాన్సర్ సోకిందనే సరికి అందరూ కంగారు పడిపోయారు. ఐతే కొన్ని నెలల చికిత్స అనంతరం శివరాజ్ కుమార్ కోలుకున్నారు.
అమెరికాలో ఆయనకు చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు. మళ్లీ ఈ నెల నుంచే షూటింగ్‌లకు కూడా హాజరవుతున్నారు. ఇటీవలే రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కోసం లుక్ టెస్ట్‌లో కూడా శివన్న పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శివరాజ్ కుమార్ క్యాన్సర్ పోరాటం మీద త్వరలో ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో తనకు వైద్యులే ఈ సలహా ఇచ్చినట్లు శివన్న తెలిపాడు. తనలాంటి సెలబ్రెటీలు క్యాన్సర్ పోరాటం గురించి అవగాహన కల్పిస్తే.. సామాన్య జనాలకు అది బాగా చేరుతుందని, అలాగే క్యాన్సర్ బాధితుల్లో కూడా స్ఫూర్తి నింపుతుందని వైద్యులు చెప్పారట.
అందుకే తన చికిత్సకు సంబంధించిన విషయాలన్నీ పొందుపరుస్తూ డాక్యుమెంటరీ చేసినట్లు శివరాజ్ కుమార్ తెలిపాడు. క్యాన్సర్ బారిన పడ్డాక తనతో పాటు కుటుంబ సభ్యులు టెన్షన్ పడడం.. ఆ తర్వాత ధైర్యం చికిత్స చేయించుకోవడం.. పాటించిన మెలకువలు, చికిత్స అనంతరం యోగా, కసరత్తులు చేయడం ద్వారా పూర్తి ఆరోగ్యం సంతరించుకోవడం ఈ అంశాలన్నింటినీ ఈ డాక్యామెంటరీలో పొందుపరుస్తున్నారు. గతంలోనూ కొందరు ఫిలిం సెలబ్రెటీలు క్యాన్సర్ పోరాటం మీద డాక్యుమెంటరీలంలో భాగమయ్యారు.