మ్యాగజైన్ స్టోరీ: జనంలోకి వెళ్లని ‘స్వర్ణాంధ్ర-2047’ పత్రం

News Image

జాతీయ స్థాయిలో ‘వికసిత భారత’ లక్ష్యానికి సమాంతరంగా రాష్ట్రాన్నీ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర 2047’ పేరుతో ఒక విజన్‌ బుక్‌ తయారు చేయించారు. అది మంచిదే.. అందులో పేర్కొన్న లక్ష్యాలు కూడా ఉన్నతమైనవే! కానీ ప్రభుత్వ ఉద్దేశాలేంటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ డాక్యుమెంట్‌పై జిల్లా, మండల స్థాయిలో చర్చ జరగాలని… పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని… ప్రజాభిప్రాయాలూ తెలుసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. డాక్యుమెంట్‌లో ఉన్న 10 సూత్రాలను.. అంశాల వారీగా గ్రామస్థాయిలో చర్చకు పెట్టాలని ప్రజాప్రతినిధులను పలుమార్లు ఆదేశించారు. ఒకరికి చెప్పాలంటే… ముందు ప్రజాప్రతినిధులకు, అధికారులకు అర్థం కావాలి కదా! అందుకే… 230 పేజీల విజన్‌ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలు కేపీఎంజీ, బీసీజీ (బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌) రూపొందించిన ఈ డాక్యుమెంట్‌లోని ప్రపంచ స్థాయి ఇంగ్లిష్‌ భాష వారినే హడలగొడుతోంది. 1995-2004 నడుమ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విజన్‌-2020 విడుదల చేశారు. అది కూడా ప్రపంచ బ్యాంకు ‘భాష’లో ఉన్నప్పటికీ ప్రజలకు కొంత దగ్గరైంది. రంగాల వారీగా ప్రభుత్వం నిర్దేశించుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు.. వాటిని చేరుకునే మార్గాలను అందులో పొందుపరిచారు. పూర్తిస్థాయిలో కాకున్నా… స్థూలంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యాలు, ఎంచుకున్న మార్గాలు అప్పట్లో ప్రజలకు అర్థమయ్యాయి. ఇప్పుడు ‘స్వర్ణాంధ్ర-2047’ దీనికి పూర్తి భిన్నంగా ఉంది. సాధారణంగా ప్రభుత్వం తాను ప్రచారం చేయదలుచుకున్న అంశాలను సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో, పంచ్‌లైన్లతో, ప్రాసలతో తయారు చేయిస్తుంది. ఒక్కసారి విన్నా, చూసినా గుర్తుండిపోయేలా ఉంటాయి. కానీ స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్‌లో ఉన్న భాషను అర్థం చేసుకోలేక అధికారులు, ప్రజాప్రతినిధులు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే మీడియాకైనా కనీసం అర్థమయ్యేలా వివరించి ఉంటే అసలు ఉద్దేశం ప్రజలకు చేరేది. దానిపై వ్యక్తమయ్యేభిన్నాభిప్రాయాలు ప్రభుత్వానికి తెలిసేవి. కానీ ఇప్పుడా అవకాశమే లేకుండా పోయింది. కార్యదర్శుల సదస్సులోనూ… శాఖల కార్యదర్శుల సదస్సు జరిగిన రోజు ఇచ్చిన ప్రజెంటేషన్లలో వాడిన భాష కూడా విజన్‌ డాక్యుమెంట్‌లో మాదిరే ఉంది. ప్రపంచ స్థాయి కన్సల్టెంట్ల భాష వాడారు. పీజీఆర్‌ఎస్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో చెప్పారు గానీ, పరిష్కారం అయిన ఫిర్యాదులను జిల్లాల వారీగా చెప్పలేకపోయారు. ఫిర్యాదుల తీరుతెన్నుల గురించి రాసిన లెక్కలనే పదిసార్లు రాశారు. హీట్‌మ్యాప్‌, హౌస్‌హోల్డ్‌ గ్రీవెన్సెస్‌, ఎస్‌ఎల్‌ఏ అంటూ.. అది తయారు చేసిన వారికి తప్ప ఎవరికీ అర్థం కాని భాషలో రంగు రంగుల గ్రాఫ్‌లతో నింపేశారు. మొత్తం 7,42,301 ఫిర్యాదులు వస్తే 4,50,735 పరిష్కరించామని చెప్పారు. ఇందులో కనీసం పది మందితో అయినా ‘మా ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి’ అని వారి మాటల్లో చెప్పించి, వాటిని ప్రజెంటేషన్‌లో చూపించి ఉంటే ఈ లెక్కలు నమ్మశక్యంగా ఉండేవి. అయితే అర్థం కాని పదాలతో రంగురంగుల గ్రాఫ్‌లతో మమ అనిపించేశారు. విజన్‌ లక్ష్యాలు ఘనమే..! విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, నీతీఆయోగ్‌, ఇంకా ఇతర సంస్థల ప్రతినిధులు.. ఇలా మొత్తం 17 లక్షలమందిని స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనలో భాగస్వాములను చేశారు. అవగాహన కోసం 4.50 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు, 38 వేలమంది కళాశాల విద్యార్థులకు పోటీలు కూడా నిర్వహించారు. జాబ్‌ ఫస్ట్‌ విధానంతో ఇండసీ్ట్రయల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ, ఎంఎస్‌ఎంఈ, పుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్‌, ప్రైవేట్‌ పార్క్‌లు, సెమీకండక్టర్‌, క్లీన ఎనర్జీ, డ్రోన, డేటా సెంటర్‌, స్పోర్ట్స్‌, టూరిజం తదితర 20 పాలసీల సమాహారాన్ని పొందుపరిచారు. ఆరోగ్యం.. సంపద.. సంతోషాలే లక్ష్యంగా దీనికి రూపకల్పన చేశారు. ‘పది సూత్రాలతో విజన డాక్యుమెంట్‌ రూపకల్పన చేశాం. జీరో పావర్టీ (పేదరిక సంపూర్ణ నిర్మూలన) కోసం ఎన్టీఆర్‌ కలలు గనేవారు. పీపుల్‌, పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పీ4)అనే విధానం ద్వారా నిరుపేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనేది నా సంకల్పం. 2047 నాటికి ఇది తప్పక నెరవేరుతుంది. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. ఇందుకు పాలసీలు తెస్తున్నాం. మంచి పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం.

Related News