టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు ఎలా ఉండేవి. వాటిని పుస్తక రూపంలో తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన నుంచే చంద్రబాబు ప్రసంగాలపై ఓ పుస్తకం తయారైంది. ఇటీవల విక్రమ్ పూల అనే రచయిత చంద్రబాబు జీవితంపై ఓ పుస్తకాన్ని రచించారు. దీనికి కొనసాగింపుగా.. తాజాగా మరో పుస్తకాన్ని ఆయన సంకలనం చేశారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితం లో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత.. ఓటమి అన్నది ఎరుగని నాయకుడిగా ప్రజాజీవితంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన 1980ల నుంచి అసెంబ్లీలో కీలక ప్రసంగాలు చేశారు.
ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా.. ఇలా అనేక రూపాల్లో చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాల్లో భవిష్యత్తును ఎక్కువగా ఆవిష్కరించిన సందర్భాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రం వరకు.. చంద్రబాబు ఆయా సందర్భాల్లో అసెంబ్లీలో చేసిన ప్రసంగాలను ఒకే చోట గుదిగుచ్చి పుస్తకంగా.. వీడియోగా రూపొందిస్తే.. ఎలా ఉంటుంది? ఈ ఆలోచన నుంచే మరో పుస్తకం ఆవిష్కృత మవుతోంది.
ఏప్రిల్ 20(ఆదివారం)న చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని జయప్రద ఫౌండేషన్ ప్రచురణ, టి. డి. జనార్దన్, విక్రమ్ పూల రూపొందించిన స్వర్ణాంధ్ర సారధి చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు శీర్షిక న రెండు సంపుటాలు(1995-2003);(2004 to 2014) ముద్రితమయ్యాయి. ఈ పుస్తకాల ఆవిష్కరణ సభ అసెంబ్లీ కమిటీ హాలులో ఆదివారం జరగనుంది. అనంతరం.. దీనికి సంబంధించిన సీడీలను కూడా ఆవిష్కరించనున్నారు. చంద్రబాబు ప్రసంగాలను గుదిగుచ్చడం ద్వారా భవిష్యత్తు తరాలకు మరింత మార్గనిర్దేశం చేసేందుకు అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పేర్కొన్నారు.
మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పుట్టిన రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ రెడీ అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిజిల్లాలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వర్ణాంధ్ర సారథిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన చంద్రబాబు.. రాష్ట్రం కోసం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు.. తమ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాలని పార్టీ కార్యాలయం కోరింది.