దర్శకుడవుతుంటే భయంగా ఉంది: హృతిక్

admin
Published by Admin — April 12, 2025 in Movies
News Image

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్‌ను ఇప్పటిదాకా హీరోగానే చూశాం. కానీ త్వరలో అతణ్ని దర్శకుడిగా చూడబోతున్నాం. ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ‘క్రిష్-4’ సినిమాతో అతను మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ ఫ్రాంఛైజీలో తొలి మూడు చిత్రాలైన కోయీ మిల్‌గయా, క్రిష్, క్రిష్-3లను హృతిక్ తండ్రి రాకేష్ రోషనే డైరెక్ట్ చేశాడు. క్రిష్-4 సినిమాకు చాలా ఏళ్ల కిందటే స్క్రిప్టు రెడీ చేసి దాన్ని పట్టాలెక్కించాలని చూశాడు కానీ.. పరిస్థితులు కలిసి రాలేదు. కొంత కాలం బడ్జెట్ సమస్యలు చుట్టుముట్టాయి. ఆ తర్వాత ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. దాన్నుంచి కోలుకున్నా సరే.. ఇప్పుడు క్రిష్-4ను డైరెక్ట్ చేసే స్థితిలో లేరు. అందుకే కొడుక్కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నట్లు హృతిక్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐతే ప్రకటన అయితే చేశాడు కానీ.. దర్శకత్వం చేయాలంటే భయంగా ఉందని అంటున్నాడు హృతిక్. ‘‘నాకు దర్శకత్వం మీద మొదటి నుంచి ఆసక్తి ఉంది. అయినా ఇప్పుడు భయపడుతున్నా. మళ్లీ కొత్తగా స్కూల్‌కు వెళ్తున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇది పూర్తిగా కొత్త విభాగం. దర్శకుడంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఎన్నో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇందులోకి ఎందుకు వచ్చానా అని కూడా అనిపించొచ్చు. ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కోవాలి. అన్నిటికీ సిద్ధపడే అడుగులు వేస్తున్నా. నాకు మీ ప్రేమ కావాలి’’ అని అభిమానులను ఉద్దేశించి హృతిక్ అన్నాడు. క్రిష్-4 ఈ ఏడాది ద్వితీయార్ధంలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లొచ్చు. ఇందులో హృతిక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడని.. అందులో ఒక పాత్ర విలన్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా ఇది నిలవనుంది.

 
Tags
bollywood director hrithik roshan
Recent Comments
Leave a Comment

Related News