వైసీపీకి విరాళాల సునామీ.. టీడీపీకేమో అలా..!

admin
Published by Admin — August 07, 2026 in Politics, National
News Image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పార్టీల ఆర్థిక పరిస్థితి, విరాళాల ప్రవాహం ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చగా మారుతుంటాయి. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ పార్టీల ఖజానాలోకి ఏ స్థాయిలో నిధులు వచ్చాయనే పూర్తి వివరాలను ఏడీఆర్ బట్టబయలు చేసింది. ఈ లెక్కలను పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా మరింత బలపడగా, మరికొన్ని పార్టీలకు విరాళాల విషయంలో ఎదురుదెబ్బలు తగిలినట్లు స్పష్టమవుతోంది.

ఏపీ రాజకీయాల విషయానికి వస్తే, వైఎస్సార్ కాంగ్రెస్(YSRCP) పార్టీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో విరాళాల సునామీ తాకింది. ఆ పార్టీ కేవలం 37 విరాళాల ద్వారానే ఏకంగా రూ.140 కోట్లను దక్కించుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కేవలం 4 విరాళాల ద్వారా రూ.62.5 కోట్లు మాత్రమే రాగా, ఈసారి రూ.77.5 కోట్ల భారీ పెరుగుదల నమోదైంది. ఈ నిధుల్లో సింహభాగం కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యాపార వర్గాల నుంచే రావడం విశేషం. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ విరాళాలన్నింటినీ ఎలాంటి నగదు లావాదేవీలకు తావులేకుండా పూర్తిగా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారానే స్వీకరించి వైసీపీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. 

మరోవైపు, తెలుగు దేశం పార్టీ(TDP) విరాళాల విషయంలో కొంత తగ్గుముఖం పట్టింది. 2023-24లో 172 విరాళాల ద్వారా రూ.100 కోట్లు అందుకున్న టీడీపీ.. 2024-25లో 267 విరాళాల ద్వారా రూ.83 కోట్లను మాత్రమే సాధించగలిగింది. దాతల సంఖ్య పెరిగినప్పటికీ, మొత్తంగా సమకూరిన విరాళాల విలువ 17.1 శాతం తగ్గి రూ.17 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే రెండు ఆర్థిక సంవత్సరాల లెక్కలను బేరీజు వేస్తే.. టీడీపీకి కార్పొరేట్ సంస్థల నుంచి రూ.116 కోట్లు, వ్యక్తిగత దాతల నుంచి రూ.66.6 కోట్లు అందినట్లు తేలింది. ఇక ఏపీలోని మరో కీలక పార్టీ జనసేనకు 2023-24లో రూ.36 కోట్లు రాగా, 2024-25కి వచ్చేసరికి ఆ మొత్తం రూ.25 కోట్లకు పడిపోయింది.

తెలంగాణ ప్రాంతీయ రాజకీయాల వైపు చూస్తే పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. గులాబీ పార్టీ బీఆర్ఎస్‌(BRS)కు విరాళాల పరంగా ఊహించని భారీ షాక్ తగిలింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8 విరాళాల ద్వారా రూ.85 కోట్లు దక్కించుకున్న ఆ పార్టీ.. 2024-25లో కేవలం నాలుగు విరాళాల ద్వారా కేవలం రూ.15 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. ఒక్క ఏడాదిలోనే రూ.70 కోట్లు తగ్గిపోవడం బీఆర్ఎస్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. 

జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతున్న ఆర్థిక పోరులోనూ తెలుగు పార్టీలు తమ సత్తా చాటాయి. దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలకు రూ.1,051.55 కోట్ల విరాళాలు రాగా.. రూ.365.78 కోట్లతో డీఎంకే ప్రథమ స్థానంలో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ రూ.184.96 కోట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా.. ఏపీ(AP) నుంచి వైసీపీ ఏకంగా రూ.140 కోట్లతో జాతీయ స్థాయిలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక రూ.83 కోట్లతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.66 కోట్లతో అన్నాడీఎంకే ఐదో స్థానంలో నిలిచాయి. మొత్తంగా మారిన ఈ ఆర్థిక సమీకరణాలు రాబోయే రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Tags
YSRCP TDP BRS Andhra Pradesh AP Politics Telangana Politics ADR Report Political Funding Janasena
Recent Comments
Leave a Comment

Related News

Latest News