తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) పార్టీ ఫిరాయింపుల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారడమే కాకుండా, మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టడం, నేరుగా అనర్హత వేటు వేయడంతో తదుపరి టార్గెట్ ఎవరనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
అసెంబ్లీ వెలుపల జరిగే పరిణామాలను తాను పరిగణలోకి తీసుకోలేనని, సభలో వ్యవహరించిన తీరు మాత్రమే చూస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును ఉన్నత ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, పదవ షెడ్యూల్ మరియు ఆర్టికల్ 191(2) ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. కాంగ్రెస్ బీ-ఫారమ్‌పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్(Danam Nagender) ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతూ కోర్టు వేటు వేయడం ఫిరాయింపుదారులకు పెద్ద షాకిచ్చింది.
తర్వాతి వికెట్ కడియం శ్రీహరినేనా?
దానం నాగేందర్ ఉదంతం తర్వాత ఇప్పుడు అందరి చూపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) వైపునకు మళ్లింది. 2023లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి అనతికాలంలోనే కాంగ్రెస్ గూటికి చేరిన ఆయనపై అనర్హత కత్తి వేలాడుతోంది. ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన కూతురు కడియం కావ్యను వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించడం, నామినేషన్ పత్రాలపై స్వయంగా తండ్రే సంతకాలు చేయడం, బహిరంగంగా కాంగ్రెస్ కండువా కప్పుకుని ఓట్లు అడగడం వంటి బలమైన సాక్ష్యాలు ఆయన మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.
ఇక స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ రద్దయిన నేపథ్యంలో, ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ కష్టాలు మొదలయ్యాయి. ఈ జాబితాలో మాజీ స్పీకర్, సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనను ప్రభుత్వం కేబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం ఇప్పుడు చట్టపరంగా ఇబ్బందికరంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి, హైకోర్టు తాజా తీర్పు ఫిరాయింపుల రాజకీయాలకు ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది. దానం ఉదంతంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ ముగింపునకు వచ్చేసరికి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి అనూహ్య మార్పులు వస్తాయో వేచి చూడాల్సిందే.