ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) మామ, కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ వివాదం అలుముకుంది. ఆయనతో పాటు మరో ఇద్దరు ప్రముఖులు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిల మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అధికారికంగా కేసులు నమోదవడం నగర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్(Hyderabad)లోని ప్రముఖ ఐటీ హబ్ నానక్‌రామ్‌గూడలోని పేరుమోసిన 'మంత్రీ కాస్మోస్' గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలోకి మురళీధర్ రెడ్డి, గడ్డం రవి నేతృత్వంలోని కొందరు వ్యక్తులు బలవంతంగా చొరబడ్డారు. ఉదయం వేళ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా దుండగులు వీరంగం సృష్టించారు. సౌత్‌వెస్ట్ కార్నర్ వైపు ఉన్న గేట్ తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, హడావుడిగా టిన్‌షీట్లను ఏర్పాటు చేసి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయ్నటించారు.
ఈ దురాక్రమణను అడ్డుకోవడానికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బందిపై దుండగులు దౌర్జన్యానికి దిగారు. వారిని పక్కకు తోసేసి, ఒకవేళ ఎదురుతిరిగితే ప్రాణాలతో ఉండరంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఈ ప్రాంగణం సర్వే నంబర్ 130 పరిధిలో ఉండగా.. ఇది ఎస్ఈజెడ్ (SEZ) జోన్ కిందకు వస్తుంది. ఇక్కడ అనేక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు కొలువుదీరి ఉన్నాయి, వేలాది మంది టెక్కీలు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వివాదం జరిగిన సౌత్‌వెస్ట్ మార్గం కేవలం సాధారణ దారి మాత్రమే కాదు. ఆ ప్రాంతంలోనే పవర్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు, చెత్త నిర్వహణ షెడ్లు ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఫైర్ ఇంజిన్లు, నీటి ట్యాంకర్లు లోపలికి రావడానికి ఇదే ప్రధాన మార్గం. అలాంటి కీలకమైన దారిని ఆక్రమిస్తే రేపు ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానిక ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ అక్రమ దౌర్జన్యానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ తదితర వివరాలను బాధితులు పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి నేరుగా గచ్చిబౌలి పోలీసులకు అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డి(Kancharla Chandrasekhar Reddy
తో పాటు మిగతా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ.. గచ్చిబౌలి పోలీసులతో పాటు డీజీపీ, సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీ తదితరులకు కూడా ఫిర్యాదు ప్రతిని పంపారు. రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో ఈ భూ వివాదం ఇప్పుడు సంచలనంగా మారింది.