డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఎస్సీ నియోజకవర్గం కొండపి నుంచి విజయం దక్కించుకున్న డోలా బాలవీరాంజనేయస్వామి(Dola Bala Veeranjaneya Swamy).. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ, సచివాలయ మరియు గ్రామ వాలంటీర్ల శాఖల మంత్రిగా ఉన్నారు. గతంలోనూ ఆయన విజయం దక్కించుకున్నా.. 2014లో ఆయనకు మంత్రిపదవి దక్కలేదు. ఇక, ఇప్పుడు మంత్రిగా డోలా పాలనా పరంగా చురుకైన చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు, స్థానిక నాయకులు కూడా చెబుతున్నారు.
ఆయన పనితీరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) దగ్గర కూడా మంచి మార్కులే పడుతున్నాయి. ముఖ్యంగా తాజాగా తలెత్తిన సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో దూకుడుగా వ్యవహరించారు. సుమారు 14,000 మంది సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. మిగిలిన అర్హుల ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు. .పరిపాలనా సంస్కరణలు తీసుకురావడంలోనూ మంత్రి ముందున్నారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో రాజకీయంగా మాస్ పాలిటిక్స్ చేయలేక పోతున్నారు.. తప్ప, మిగిలిన విషయాల్లో డోలాకు మంచి మార్కులే పడుతున్నాయి.
ప్రస్తుతం మంత్రి డోలా.. విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశాల్లో పాల్గొంటూ, జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించారు. విపక్షాల విమర్శలు, ఆందోళనలపై ప్రభుత్వం తరఫున గట్టిగా స్పందిస్తున్నారు. ఆయన పరిపాలనా వేగాన్ని ప్రశంసించేవారు ఉన్నా... రాజకీయంగా కొంత వెనుకబడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన హాస్టళ్ల తనిఖీలు నిర్వహించడంతోపాటు... విద్యార్థుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాజకీయం మాటేంటి..?
వ్యక్తిగత రాజకీయాల కు వస్తే.. మంత్రిగా డోలా(Minister Dola) వెనుకబడ్డారన్న వాదన ఉంది. కేవలం పార్టీపైనే ఆధారపడుతున్నా రనినాయకులు చెబుతున్నారు. నిజానికి సీనియర్ నాయకుడిగా ఉండడంతో వ్యక్తిగత ఇమేజ్ కూడా పెంచుకునే లా రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. కూటమి సమన్వయానికి వస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నప్పటికీ.. కొండపి నియోజకవర్గంలో వర్గ పోరు ఎక్కువగా సాగుతోంది. దీనిని తగ్గించే దిశగా మంత్రి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జనసేన నాయకులతో ఆయనకలివిడి తక్కువగా ఉందన్న విమర్శలను తగ్గిస్తే.. వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది.