దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాటను కొందరు అసభ్యకరంగా ఏఐలో చిత్రీకరించిన వైనంపై జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు నటులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఆ వీడియో తయారు చేసి షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే, ఆ క్రమంలోనే ఆ వివాదానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు 'సౌత్ డిజిటల్ మీడియా' అనే ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ లోని ఫొటోలో ఒక వ్యక్తికి ముసుగు వేసి ఉంది. అతడి పక్కన పోలీసులు, ఎన్టీఆర్ అభిమానులు, హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ చిత్రం కూడా ఉంది. దీంతో, ఆ ఫొటో వైరల్ అయింది.
అయితే, అది ఒక ఫేక్ ఫొటో కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఒక ఫేక్ చిత్రాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాదు, ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అధికారిక 'ఎక్స్' ఖాతాను ట్యాగ్ చేసి మరీ తెలియపరిచారు సజ్జనార్. అభిమానుల్లో కొందరు తన ఫొటోను ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారని, ఈ అంశాన్ని దయచేసి గమనించాలని జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన కోరారు.
ఆ ఫొటో ఏఐతో సృష్టించిన డీప్‌ఫేక్ చిత్రమని సజ్జనార్ తెలిపారు. ఈ ఫేక్ కంటెంట్‌ను చూసి మోసపోవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో కనిపించే ప్రతీదాన్ని గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. ఏఐ ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.