తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా పెను కలకలం సృష్టించిన వివాదం ఒక్కసారిగా అనూహ్య మలుపు తిరిగింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో వ్యక్తిగత ఆరోపణలు గుప్పించి, రాజకీయంగా దుమారం రేపిన మాజీ మంత్రి కొండా సురేఖ(Konda Surekha).. తాజాగా ఎక్స్ వేదికగా బేషరతు క్షమాపణలు కోరడం పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష పార్టీని విమర్శించే ఆవేశంలో కొద్ది నెలల క్రితం తాను చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని, అవి కేటీఆర్‌ను గానీ, ఆయన కుటుంబాన్ని గానీ తీవ్రంగా నొప్పించి ఉంటే పశ్చాతాపపడుతున్నానని ఆమె పేర్కొన్నారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే ఆనాడు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావంటూ ఆమె తన పోస్టులో స్పష్టం చేశారు.
అయితే, ఒకప్పుడు "ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు, కోర్టులోనే తేల్చుకుంటా" అంటూ ఛాలెంజ్ చేసిన సురేఖ.. ఇప్పుడు సడన్‌గా ప్లేట్ ఫిరాయించడం వెనుక అసలు కథ ఏమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో సమంత-నాగచైతన్య(Samantha-Naga Chaitanya) విడాకులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను కేటీఆర్‌కు ఆపాదిస్తూ ఆమె చేసిన కామెంట్లు పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
ఈ లీగల్ వార్‌లో కోర్టు విచారణ కీలక దశకు చేరుకోవడం, ఒకవేళ న్యాయస్థానంలో వ్యక్తిగత హాజరు, చట్టపరమైన శిక్షల ముప్పు ముసరుకుంటుండటంతోనే సురేఖ ఈ యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సరిగ్గా ఇదే తరహాలో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులోనూ విచారణ సమయంలో ఆమె రాత్రికి రాత్రే క్షమాపణలు చెప్పి వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే ఫార్ములాను రిపీట్ చేసి, లీగల్ ట్రబుల్స్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాగా, కేవలం క్షమాపణ పోస్ట్ పెట్టి సురేఖ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చూస్తున్నప్పటికీ.. కేటీఆర్(KTR) మాత్రం ఈ లీగల్ పోరాటాన్ని ఇంతటితో వదిలేస్తారా, లేక కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలను కొనసాగిస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.