బ్యాడ్ టాక్‌తోనూ డామినేషన్

admin
Published by Admin — November 16, 2026 in Movies
News Image

ఈ వీకెండ్లో తెలుగులో అరడజనుకు పైగానే చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అన్నీ చిన్న స్థాయివే. వాటిలో కొన్ని సినిమాల రిలీజ్ నామమాత్రం. ఏమాత్రం జనాల దృష్టిలో పడలేదు. మాయలేడి, చంద్రయాన్ సినిమాలు ఆశించిన టాక్ తెచ్చుకోలేకపోయాయి. వాటికి బజ్ కూడా తక్కువే. మిగతా వాటిలో జనం బాగా చర్చించుకున్నది ఇట్లు అర్జున, డీఎన్‌కే (దొంగ నా కొడుకు) సినిమాల గురించే. ఇందులో ‘ఇట్లు అర్జున(Itlu Arjuna)’కు చేసిన పబ్లిసిటీ పెద్ద పెద్ద సినిమాలకు కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు. 

అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లు ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఇక సోషల్ మీడియా పబ్లిసిటీ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఈ చిత్రానికి ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ పెద్ద సంఖ్యలో వేయగా.. వాటి నుంచి పాజిటివ్ టాకే వచ్చింది. రివ్యూలు కూడా ఫుల్ పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో పాటుగా ‘డీఎన్‌కే’కు కూడా కొంచెం లేటుగా పెయిడ్ ప్రిమియర్స్ పడ్డాయి. కానీ ఈ చిత్రం బాగా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది.

కానీ బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి చూస్తే మాత్రం టాక్‌‌తో సంబంధం లేనట్లు కనిపిస్తోంది. బ్యాడ్ టాక్ తెచ్చుకున్న ‘డీఎన్‌కే(DNK)’ సినిమాకే ఎక్కువ టికెట్లు తెగుతున్నాయి. మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. అంత మంచి టాక్, రివ్యూలు తెచ్చుకుని కూడా ‘ఇట్లు అర్జున’కు ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో లేవు. బుక్ మై షోలో గంటకు అమ్ముడయ్యే టికెట్ల విషయంలో ‘డీఎన్‌కే’ స్పష్టమైన పైచేయి సాధిస్తోంది. బుకింగ్స్ చూస్తే.. ‘ఇట్లు అర్జున’కు ఫాస్ట్ ఫిల్లింగ్ షోలు తక్కువగా ఉన్నాయి. ‘డీఎన్‌కే’కు చాలా షోలు ఆ మోడ్‌లో ఉన్నాయి.

రివ్యూలు, టాక్ ఎలా ఉన్నప్పటికీ.. మౌళి(Mouli)కి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ ‘డీఎన్‌‌కే’కు బాగా ప్లస్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది గొప్ప సినిమా కాకపోయినా.. యూత్ నచ్చే అడల్ట్ కామెడీ వల్ల ఆ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నట్లున్నారు. సినిమా పరిమిత బడ్జెట్లో తెరకెక్కడం వల్ల వీకెండ్ వసూళ్లు సినిమాను సేఫ్ జోన్లోకి చేర్చేలా ఉన్నాయి. అదే సమయంలో రూ.40 కోట్లు పెట్టి తీసిన సినిమా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతుండడం ఒకింత నిరాశ కలిగించే విషయమే.

Tags
Itlu Arjuna DNK Mouli Tollywood Telugu Cinema Latest News Movie News
Recent Comments
Leave a Comment

Related News