వేర్ ఈజ్ విజయసాయిరెడ్డి..?

admin
Published by Admin — November 16, 2026 in Politics, Andhra
News Image

కొత్తగా రాజకీయ వేదికపైకి అడుగుపెట్టిన నాయకులైనా, దశాబ్దాల అనుభవం ఉన్న దిగ్గజాలైనా పార్టీ పెట్టిన వెంటనే చేసే మొదటి పని హోరెత్తించే సభలు, ప్రెస్‌మీట్లు, చేరికల జోరు. కానీ, ఇటీవల 'పరివర్తన రాజనీతి పార్టీ' (PRP) పేరుతో కొత్త రాజకీయ ప్రకటన చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పార్టీని ప్రకటించిన మరుక్షణం నుంచీ ఆయన బహిరంగ వేదికలపై కనిపించకపోవడం, ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారు? ఆయన తెరవెనుక ఆడుతున్న పెద్ద గేమ్‌ ఏంటి? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి దాని విస్తరణ వరకు ప్రతి అడుగులోనూ ముందుండి నడిపించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు తన సొంత కుంపటి పెట్టుకున్నాక పూర్తిగా భిన్నమైన శైలిని ఎంచుకున్నారు. సాంప్రదాయ రాజకీయ నాయకుల మాదిరిగా ఊరూవాడా తిరిగి జనాలను కూడగట్టే పద్ధతికి ఆయన స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుత తరం ఆలోచనలకు తగ్గట్టుగా కేవలం భౌతిక ప్రచారానికే పరిమితం కాకుండా, డిజిటల్ మాధ్యమాలే అస్త్రంగా ముందుకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన పార్టీలో జెన్-జీ (Gen-Z) యువతకు, బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తానని ప్రకటించిన ఆయన.. ఆయా వర్గాలను నేరుగా సోషల్ మీడియా ద్వారా ఎలా కనెక్ట్ చేయాలో అనే దానిపై నిపుణులతో సుదీర్ఘ మథనం జరుపుతున్నారట. ఈ డిజిటల్ బ్లూప్రింట్ తయారీలో బిజీగా ఉండటం వల్లే ఆయన ప్రస్తుతానికి బయటకు రావడం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ కేంద్రంగా సీక్రెట్ ఆపరేషన్..!
ఈ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టేందుకే విజయసాయిరెడ్డి ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) తో ఆయన భేటీ అయ్యారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో వైసీపీ(YCP)కి సలహాదారుగా పనిచేసిన అనుభవం ఉండటంతో, పీకే సలహాలు సహాయం తీసుకోవాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే, పీకే స్వయంగా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ విషయంలో నేరుగా హామీ ఇవ్వలేకపోయినా.. తన శిష్యులు లేదా అనుభవజ్ఞులైన ఎన్నికల వ్యూహకర్తలను విజయసాయిరెడ్డికి సహాయంగా ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఒకవైపు ప్రత్యర్థులు ఆయన సైలెంట్ పాలిటిక్స్పై రకరకాల ఊహాగానాలు చేస్తుంటే, మరోవైపు విజయసాయిరెడ్డి(Vijaysai Reddy) మాత్రం ఎవరికీ చిక్కకుండా తన ప్లాన్‌ను నిశ్శబ్దంగా అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బాహాటంగా శత్రువులకు చిక్కకుండా, కేవలం టెక్నాలజీ, పక్కా ప్రణాళిక, డిజిటల్ రీచ్‌ను నమ్ముకుని ఆయన నడుపుతున్న ఈ సీక్రెట్ గేమ్ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఈ సైలెన్స్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? రాబోయే రోజుల్లో ఆయన కదలికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.

Tags
Vijaysai Reddy PRP Party Andhra Pradesh AP Politics Delhi
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News