భూమా అఖిల ప్రియపై దాడిని ఖండించిన బుచ్చి రామ్ ప్రసాద్

admin
Published by Admin — November 26, 2026 in Politics
News Image
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ విధ్వంస క్రీడ రోజుకో కొత్త పుంతలు తొక్కుతూ విభిన్న రూపాలు సంతరించుకుంటుందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్రంగా విమర్మించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజా బలం తగ్గడంతో దాడులకు తెగపడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా అహోబిలంలో ఇవాళ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియపై వైసీపీ గూండాల దాడి, పార్వతీపురం మన్యం జిల్లాలో అభ్యర్థిపై హత్యయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, APEWIDC చైర్మన్ కుప్పం రాజశేఖర్ లతో కలిసి రాష్ట్రంలో వైసీపీ నాయకుల చేసిన విధ్వంసం, అల్లర్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) కార్యదర్శి డా. ఎ. మల్లికార్జున, ఐజీ రాజకుమారికి ఫిర్యాదు చేశారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య.. ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందలేమనే భావనతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అల్లర్లు, దాడులు, బెదిరింపులు సృష్టించి రాజకీయ ఉనికిని చాటుకోవాలనే ధోరణి వైసీపీలో కనిపిస్తోందన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో స్పష్టంగా తెలుసని... అయినప్పటికీ పార్టీ ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించడం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. వైసీపీ చేస్తుంది రాజకీయ పోరాటం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే విపరీత ధోరణి అని విమర్శించారు.
 
*అఖిలప్రియ వాహనంపై దాడి అత్యంత దారుణం*
 
నంద్యాల జిల్లా అహోబిలంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి వాహనంపై జరిగిన రాళ్లదాడిని వర్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధుల వాహనాలపై దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనలో వాహనం అద్దాలు ధ్వంసమై డ్రైవర్ గాయపడినట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
*మన్యం జిల్లాలో మహిళా అభ్యర్థిపై దాడి అమానుషం*
మన్యం జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరైనవి కాదని హెచ్చరించారు. ఈ ఘటనతో ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమయానికి పోలీసులు జోక్యం చేసుకోకపోయి ఉంటే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉండేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలు, ఓటర్ల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో వైసీపీ రౌడీ ముకలు దాడులు, ఘర్షణలు, బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం, ఓటర్లను భయపెట్టడం, పోలీసు యంత్రాంగాన్ని సైతం సవాలు చేయడం రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధమని అన్నారు. ఈ ఘటనల వెనుక ఉన్నవారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
*జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ పద్ధతిని మార్చుకోవాలి*
 
జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి రాజకీయ చర్యలోనూ హింసాత్మక ధోరణి కనిపిస్తోందని ఆరోపించారు. రాజకీయ విమర్శలు చేయడం వేరు, ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డుకోవడం వేరని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాలి, ప్రజల విశ్వాసం పొందాలి, ఎన్నికల్లో గెలవాలి. అంతేకానీ దాడులు, బెదిరింపులు, విధ్వంసాలతో రాజకీయ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నించడం సరైన విధానం కాదన్నారు. రెండేళ్లు ఆగండి.. మళ్లీ అధికారంలోకి వస్తానంటున్న జగన్ మోహన్ రెడ్డి.. ముందుగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రాజకీయ నాయకుల వ్యవహారశైలిని గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ పద్ధతిని మార్చుకొని శాంతియుత రాజకీయాలు చేయాలని హితవు పలికారు.
Tags
ap brahman welfare corporation chairman buchi ram prasad condemns attack tdp mla bhuma akhila priya
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News