ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏదైనా అనుకున్నారంటే అది సాధించకుండా వదిలిపెట్టరు. తాజాగా పట్టుబట్టి మరీ రికార్డు కొట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ సర్కార్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ తీరాన యోగాంధ్ర పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు మరియు చాలామంది ప్రజలు పాల్గొన్నారు. అందరూ కలిసి 45 నిమిషాల పాటు యోగాసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రపంచ దేశాలు మెచ్చుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని.. గిన్నిస్ రికార్డు సాధించాలని సీఎం చంద్రబాబు ముందు నుంచి పదే పదే చెబుతున్నారు. అయితే ఆయన కోరుకున్నట్లే విశాఖ యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. గతంలోని గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన యోగాలో 1.47 లక్షల మంది పాల్గొని యోగాసనాలు వేశారు. అయితే ఈ రికార్డ్‌ను విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర బద్దలు కొట్టింది. ఈ రోజు విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి 29 కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమిలి నియోజకవర్గంలోని తీరం వరకు నిర్వమించిన యోగా కార్యక్రమంలో దాదాపుగా 3.3 లక్షల మంది పాల్గొన్నారు.
ప్రతి 10 వేల మందికి ఒక ప్రత్యేక శిక్షకుడు చొప్పున నియమించి.. అందరి చేత యోగాసనాలు వేయించారు. దాంతో విశాఖ యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. అలాగే మరోవైపు 25 వేల మంది గిరిజన స్టూడెంట్స్ 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయడంతో విశాఖలో జరిగిన `మెగా యోగా` ఈవెంట్ కూడా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకేసారి రెండు గిన్నిస్ రికార్డులు సాధించారంటే దాని వెనక చంద్రబాబు కృషి, పట్టుదల ఎంతగానో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.