ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’ చూసిన వాళ్లకు అందులో రైల్వే స్టేషన్లో షాపు నడిపే మహిళ పాత్రను అంత సులువుగా మరిచిపోలేరు. తన పేరు.. ఛాయా కదమ్. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో ఆ నటి పలు బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది ఛాయా. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన ఛాయా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తన మెడకు చుట్టుకున్నాయి.
ఛాయా కదమ్ నిషేధిత జాబితాలోని వన్యప్రాణుల మాంసాన్ని తిందన్న ఆరోపణలపై మహారాష్ట్ర అటవీ శాఖ విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలు నిరూపితమైతే ఆమె చిక్కుల్లో పడ్డట్లే. ఓ ఇంటర్వ్యూలో ఛాయాా మాట్లాడుతూ.. తన ఆహారపు అలవాట్ల గురించి చెప్పింది.
తనకు మాంసాహారం చాలా ఇష్టమని చెబుతూ.. కణితి (మౌస్ డీర్), కుందేలు, అడవి పంది, ఉడుము, ముళ్ల పంది వంటి జంతువుల మాంసాన్ని తాను రుచి చూసినట్లు వెల్లడించింది.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పాపులర్ అయి.. ముంబయికి చెందిన ప్లాంట్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఛాయా కదమ్‌కు సమన్లు జారీ చేశారు. విచారణకు రావాాలని ఛాయా కదమ్‌కు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆమెకు ఈ మాంసం అందజేసిన వ్యక్తుల మీదా దృష్టిసారించారు. అటవీ అధికారుల నోటీసులపై స్పందిస్తూ.. తాను విచారణకు సహకరిస్తానని, ప్రస్తుతం అందుబాటులో లేనని బదులిచ్చింది ఛాయా. నటిగా మంచి పేరు సంపాదించి కెరీర్లో దూసుకెళ్తున్న దశలో.. అత్యుత్సాహంతో తాను తిన్న నిషేధిత మాంసాహారం గురించి చెప్పి చిక్కుల్లో పడింది ఛాయా.