వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కష్టాలు వీడనంటున్నాయి. కేసులు వెంటాడుతున్నాయి. దాదాపు 95 రోజుల నుంచి వంశీ జైల్లోనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే నానా తిప్పలు పడి ఒక కేసులో బెయిల్ తెచ్చుకుంటుంటే.. మరొక కేసులో పీటీ వారెంట్ దాఖలవుతోంది. ఇప్పటికే వంశీ పై ఐదారు కేసులు నమోదు అయ్యాయి. అయితే సత్య వర్ధన్ ను అపహరించి బెదిరించిన కేసులో ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది. మరో నాలుగు కేసుల్లోనూ బెయిల్, ముందస్తు బెయిలు వచ్చింది.
అలాగే నేడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తీర్పు వెలువడనుంది. ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ వల్లభనేని వంశీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు.. 2019 ఎన్నికల టైం లో ప్రభుత్వం అనుమతి లేకుండా, ఎమ్మార్వో ఇతర రెవెన్యూ అధికారులకు తెలియకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు వంశీ నకిలీ ఇలా పట్టాలను పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో వంశీ పై కేసు నమోదయింది.
అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో కేసు నుంచి వంశీ తెలివిగా తప్పించుకున్నారు. అయితే కేసు క్లోజ్ కాలేదు. తాజాగా నూజివీడు పోలీసులు ఈ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేయగా.. అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. మే 19వ తేదీ లోగా వంశీని తమ ముందు హాజరు పరచాలని నూజివీడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ టీడీపీ ఆఫీసు దాడి కేసులో బెయిల్ వచ్చిన.. వంశీ జైలు నుంచి విడుదల అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.