రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్బాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. `ఏడాది పాలనపై ప్రగతి నివేదిక` పేరుతో ఓ లేఖను ఆవిష్కరించారు. ఏడాది పాటు ప్రజల సహకారంతో పాలన సాగించామని తెలిపారు. ఈ ఏడాదిలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ముఖ్యంగా పెట్టుబడి దారుల్లో సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి కల్పించామని పేర్కొన్నారు.
ఈ ఏడాది పాలనలో కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకారం అందించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. సీఎంగా చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తున్నామన్న ఆయన.. చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రం వడివడిగా ముందుకు సాగుతుందన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో మరింతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి సాగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రంలో హామీలను నెరవేర్చేందుకు.. ప్రజల సంక్షేమానికి పాటుపడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పవన్ కల్యాణ్ వివరించారు. ఐదేళ్ల పాలనను ఏడాదిలోనే చేసి చూపించామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలన చూసిన కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తోందని తెలిపారు. ఐదేళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర-2047 సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఈఏడాది కాలంలో తనకు కేటాయించిన గ్రామీణ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, అటవీ శాఖల ద్వారా చేసిన పనులను ప్రజల ముందు ఉంచారు. ఈ నివేదికను నిశితంగా పరిశీలించాలని పవన్ కల్యాణ్ ప్రజలకు సూచించారు. దీనికి నాలుగింతలు ఎక్కువగా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు.