వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుంటూరు నుంచి పల్నాడు జిల్లా వరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
అయితే గుంటూరు, పల్నాడు జిల్లాల సరిహద్దు ప్రాంతం కొర్రపాడు శివారులో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ వద్ద అంబటి సృష్టించిన వీరాంగం విమర్శలకు దారి తీసింది. జగన్ తో పాటు మరికొన్ని వాహనాలను పోలీసులు ముందుకు పంపారు. ఆపై రద్దీ నియంత్రించేందుకు వెనుక ఉన్న వాహనాలను కొంత సమయం పాటు ఆపారు. దాంతో రంగంలోకి దిగిన అంబటి రాంబాబు వాహనాలను ఎందుకు ఆపాలంటూ పోలీసులపై చిందులు తొక్కారు.
ఏటుకూరు వద్ద ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడని.. జగన్ కాన్వాయ్ కి ఇబ్బంది కలగకూడదని వాహనాలను ఆపామని పోలీసులు వివరణ ఇస్తున్నా అంబటి పట్టించుకోలేదు. తన సోదరుడు మురళితో కలిసి రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను అంబటి విసిరి పారేశారు. కార్యకర్తల వాహనాలను ముందు పంపారు. అడ్డు చెప్పిన పోలీసులపై మీ అంత చూస్తా అంటూ నోరు పారేసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా కూడా గుంటూరు జిల్లాలో పోలీసులతో అంబటి దురుసుగా ప్రవర్తించారు. పట్టాభిపురం సీఐపై బెదిరింపులకు పాల్పడంతో ఆయనపై కేసు ఫైల్ అయింది. మరి ఈ రెండు కేసుల్లో అంబటి రాంబాబుపై పోలీసులు యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.