తెలుగు సినిమాల‌పై ట్రంప్ గుది బండ‌..!

admin
Published by Admin — May 05, 2025 in Politics
News Image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుగు సినిమాల‌పై గుదిబండ వేశారు. అమెరికాలో తెలుగు చిత్రాల‌కు ఎంత‌టి మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్టార్ హీరోల సినిమాలు అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబ‌డుతుంటాయి. అక్కడ వచ్చిన షేర్‌లో కనీసం సగం ప్రొడ్యూస‌ర్ల అకౌంట్లోనే ప‌డేది. కానీ ఇప్పుడు అత్యధిక మొత్తం అమెరికా ప్రభుత్వ అకౌంట్లో టాక్స్ రూపంలో ప‌డ‌నుంది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణ‌య‌మే అందుకు కార‌ణం. విదేశాల్లో నిర్మించి, అమెరికాలో విడుద‌ల చేసే అన్ని రకాల చలనచిత్రాలపై తక్షణమే 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

అమెరికా సినీ పరిశ్రమను రక్షించడమే లక్ష్యమంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు. విదేశీ ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాల‌తో అమెరికన్ ఫిలిం మేకర్లను, స్టూడియోలను తమ దేశాలకు ఆకర్షిస్తున్నాయని.. దాంతో ఇక్క‌డి సినిమా ప‌రిశ్ర‌మ వేగంగా దెబ్బ‌తింటోంద‌ని ట్రంప్ ఆరోపించారు. మాకు అమెరికాలో తయారైన సినిమాలే కావాలని స్ప‌ష్టం చేసిన ట్రంప్.. ఇతర దేశాల చిత్రాల‌కే కాకుండా అమెరికాలో షూటింగ్ జ‌ర‌పుకోని హాలీవుడ్ సినిమాలపైనా ఈ పన్ను విధించారు.

ఇక ట్రంప్ తాజా నిర్ణ‌యంతో విదేశీ చిత్ర పరిశ్రమలతో పాటు భార‌తీయ సినిమాలు మ‌రీ ముఖ్యంగా అమెరికాలో గణనీయమైన మార్కెట్ కలిగిన తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావం ప‌డ‌బోతోంది. ఇండియాలో క‌న్నా అమెరికాలో ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు చిత్రాలు ఎన్నో ఉన్నాయి. హిట్ టాక్ వ‌చ్చిదంటే మ‌న సినిమాలు అక్క‌డ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరుతూ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. నిర్మాతలకు భారీ ప్రాఫిట్ తెచ్చిపెడుతున్నాయి. కానీ, తాజా 100 శాతం సుంకం నిర్ణయంతో.. అమెరికాలో తెలుగు సినిమాలను విడుదల చేసే పంపిణీదారులకు దిగుమతి ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోనుంది.

ఈ భారాన్ని టికెట్ ధరల పెంపుపై వేస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. ఇది బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో తెలుగుతో స‌హా భార‌తీయ చిత్రాల‌కు అక్కడ రిలీజ్ ఖర్చులు కూడా రావేమోనన్న ఆందోళన మొద‌లైంది. వంద శాతం పన్ను అంటే.. భారీ బడ్జెట్, అగ్ర తారల చిత్రాలకు మాత్రమే ఈ అదనపు భారాన్ని తట్టుకునే సామ‌ర్థ్యం ఉంటుంది. ఇక చిన్న, మధ్య తరహా బడ్జెట్ చిత్రాల అమెరికా విడుద‌ల ప్రశ్నార్థకమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags
donald trump Indian Movies Latest news Tariffs Telugu movies Telugu News trump
Recent Comments
Leave a Comment

Related News

Latest News