అది చూసుకునే నాకు పొగరు: బాల‌కృష్ణ‌

admin
Published by Admin — May 05, 2025 in Movies
News Image

ఓవైపు న‌టుడిగా, మ‌రోవైపు రాజ‌కీయ నాయ‌కుడిగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ ను పద్మభూషణ్ పురస్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్యకు హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ శ్రేణులు ఘ‌నంగా స‌న్మాణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా బాల‌య్య వేదిక‌పై మాట్లాడుతూ.. ` హిందూపురం నా రెండో పుట్టినిల్లు. ఇది నందమూరి పురం. ఇక్కడ పౌర సన్మాన సభ నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. చాలా మంది పద్మభూషణ్ మీకు ఆలస్యంగా ఇచ్చారని అంటున్నారు. కానీ క‌రెక్ట్ టైమ్ లో ఇచ్చారని వారికి నేను చెప్పాను. ఎందుకంటే, నాన్నగారి శతజయంతి నిర్వహించుకోవడం.. వ‌రుస‌గా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొంద‌డం.. సినిమాల పరంగా నాలుగు వరుస విజ‌యాలు రావ‌డం.. హీరోగా 50 ఏళ్లు పూర్తి కావడం.. ఈ తరుణంలోనే పద్మభూషణ్ వ‌రించ‌డం ఎంతో సంతోషంగా అనిపించింద‌`ని చెప్పుకొచ్చారు.

అలాగే ఎటువంటి బ్రేక్ తీసుకోకుండా 50 ఏళ్ల పాటు క‌థానాయకుడుగా కొనసాగిన వ్య‌క్తి తాను త‌ప్ప ప్రపంచంలో మరొకరు లేరని బాల‌య్య అన్నారు. అందుకు శక్తినిచ్చిన, మ‌ద్ధ‌తుగా నిలిచిన‌ తెలుగు జాతికి బాల‌య్య కృతజ్ఞతలు తెలిపారు. ఇక `ఏం చూసుకుని బాలకృష్ణకు అంత పొగరు` అని కొందరు అంటుంటారు.. నన్ను చూసుకుని నాకు పొగరు అంటూ బాలయ్య‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, అప్ క‌మింగ్ సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో `అఖండ 2` మూవీ చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంద‌ని అంటున్నారు.

Tags
Balakrishna Felicitation Ceremony hindupuram Latest news Tollywood
Recent Comments
Leave a Comment

Related News