కమల్ హాసన్, మణిరత్నంల లెజెండరీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ మీద విడుదలకు ముందు భారీ అంచనాలే నెలకొన్నాయి. కమల్‌కు ‘విక్రమ్’ తర్వాత మరో బ్లాక్ బస్టర్ పడుతుందని.. మణిరత్నం ఈ చిత్రంతో మళ్లీ పూర్వవైభవం అందుకుంటాడని అనుకున్నారు వారి అభిమానులు. కానీ ఈ ఇద్దరి కెరీర్లో అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా ‘థగ్ లైఫ్’ విమర్శలు ఎదుర్కొంది.
థియేటర్లలో ఈ సినిమా వారం కూడా నిలబడే పరిస్థితులు కనిపించడం లేదు. థియేటర్లలో సినిమా చూసిన వాళ్లు.. ఓటీటీలో కూడా దీన్ని చూడడం కష్టమే అంటూ కామెంట్లు చేశారు. అయినా సరే.. ఎంతైనా ఇది కమల్, మణిరత్నం కలయికలో తెరకెక్కిన సినిమా కాబట్టి ఆన్ లైన్లో అయినా సినిమా చూద్దామని ఓ వర్గం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఐతే ఇంతకుముందు కమల్.. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాలకు కానీ ఓటీటీలోకి రాదని తేల్చి చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్‌తో ఆ మేరకే ఒప్పందం జరిగింది కూడా.
కానీ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ కొన్ని వారాలు కూడా థియేటర్లలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తమిళేతర భాషల్లో ఆల్రెడీ ఆ సినిమా వాషౌట్ అయిపోయింది. తమిళంలో రెండు మూడు వారాలు ఆడొచ్చు. కాబట్టి ఎనిమిది వారాల గ్యాప్ వల్ల ఏ ప్రయోజనమూ ఉండబోదు. థియేట్రికల్ రిలీజ్‌కు, డిజిటల్ రిలీజ్‌కు గ్యాప్ తగ్గిస్తే నిర్మాతలకు కొంచెం ఆదాయం పెరుగుతుంది. ఆ మేరకు డీల్ రివైజ్ చేస్తుంది నెట్‌ఫ్లిక్స్. ఇప్పుడు కమల్, మణిరత్నం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సినిమా ఇంత డిజాస్టర్ అయ్యాక థియేటర్లను కాపాడ్డం, ప్రేక్షకులను బిగ్ స్క్రీన్స్‌కు రప్పించడం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. వీలైతే నెల రోజుల్లోనే సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ చిత్రాన్ని కమల్, మణిరత్నం కలిసి రూ.250 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కించారు.