ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పల్నాడు జిల్లా పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఈనెల 18న జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ళ గ్రామంలో వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు జరగబోతోంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత జగన్ పాల్గొనబోతున్నారు. 30 వేల మంది కార్యకర్తలు కూడా హాజరు కావాల్సి ఉండగా.. అందుకు నో పర్మిషన్ అనేశారు పోలీసులు.
జూన్ 18న వైఎస్ జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వస్తున్నారని, ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఇన్‌ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి ఇటీవల పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన పోలీసులు అనుమతిని నిరాకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహావిష్కరణ జరిగే ప్రదేశానికి కేవలం పది అడుగుల వెడల్పు ఉన్న దారి మాత్రమే ఉంది. పైగా ఆ దారికి ఇరువైపులా నివాస గృహాలు ఉన్నందున 30 వేల మంది వచ్చేందుకు అవకాశం లేదని తెలిపారు.
అలాగే 30 వేల మంది వస్తున్నారని చెప్పారు తప్ప.. తాము అడిగిన వివారాలు ఏమీ ఇవ్వలేదని ఎస్పీ పేర్కొన్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో చోటుచేసుకున్న కొన్ని అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని జగన్ తో సహా వంద మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చామని జిల్లా ఎస్పీ వివరించారు. జగన్ కాన్వాయ్‌తో పాటు అదనంగా మరో మూడు వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. తాము అడిగిన పత్రాలు ఇస్తే అనుమతుల గురించి మరోసారి పరిశీలిస్తామని.. పోలీసుల పర్మిషన్ లేకుండా కార్యక్రమం చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో జగన్ కు బిగ్ షాక్ తగిలినట్లైంది.