2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని..అంటూ వైసీపీ కార్యకర్త ఒకరు చూపించిన ప్లకార్డు వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. అయితే, ఆ కార్యకర్త ప్లకార్డు పట్టుకోవడాన్ని ఖండించాల్సిన జగన్…అందులో తప్పేంటి అని ప్రశ్నించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు.
సినిమాల్లో నరుకుడు డైలాగ్ ను ఫ్లెక్సీల్లో పెట్టొచ్చా అని చంద్రబాబు ప్రశ్నించారు. చంపేయడాన్ని కూడా సినిమాల్లో చూపిస్తారని, అలా అని బయట చంపేస్తారా అని నిలదీశారు. మా బాబాయిని లేపేసినా తప్పు లేదు..నువ్వెవరు అడగడానికి..నేనేమైనా చేస్తా..ఎవరూ అడగొద్దు అని అంటే ఎలా అని ప్రశ్నించారు. అలాంటి మానసిక స్థితి ఉన్నవారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.
నాయకులకు హుందాతనం ఉండాలని, ఓ వైపు యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ దేవతలకు పొట్టేళ్లను బలిచ్చేటప్పుడు రప్పా రప్పా అనేవారని,ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.
గతంలో నేరస్తులకు దూరంగా ఉండేవాళ్లమని, ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. బెట్టింగులు, హత్యలు, అత్యాచారం చేసేవాళ్లకు విగ్రహాలు పెడతారా? అని ప్రశ్నించారు. తానేం చేసినా అదే చట్టం అంటే ఎలా? అని నిలదీశారు. ఏ రాష్ట్రంలో ఇలా లేదని, నేరపూరిత రాజకీయం చేస్తే తాటతీస్తాం అని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్‌లు ఉండవని, ఇసుక, లిక్కర్‌లో ఏం జరిగిందో అందరికి తెలుసని అన్నారు.
ఇక, జూన్ 21 ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల వరకు యోగా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. మూడున్నర లక్షల మంది పాల్గొనే ఈ ఈవెంట్ కు ఏర్పాట్లు చేశామని తెలిపారు.