జాతీయ మహిళా కమిషన్ అంటే..రాజ్యాంగ బద్ధమైన సంస్థ. దీనికి జ్యుడీషియల్ అధికారాలు ఉన్నాయి. అందుకే మహిళా కమిషన్ స్పందనకు ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా అమరావతి మహిళా రైతులు.. అక్కడి ప్రాంతంపై వైసీపీ ప్రధాన మీడియా సాక్షిలో అనలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు మాటల మంటలు రేపుతున్నాయి. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆగ్రహంతో నిప్పులు చెరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. రాజధాని అమరావతిలోని మహిళలు `ఆ తర హా` అంటూ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. దీనిని సీరియస్ గా భావిస్తున్నట్టు తెలిపింది. దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటూ. ఏపీ డీజీపీకి కమిషన్ లేఖ రాసింది. మూడు రోజుల్లోగా ఆయా వివరాలను తమకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు.. మహిళా కమిషన్ లేఖ రాసింది.
ఇప్పటి వరకు జరిగిన విషయాలను పరిశీలిస్తే.. ఏపీ పోలీసులకు.. కంభం పాటి శిరీష అనే దళిత మహిళ ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీలుఎక్కువగా ఉన్న అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తప్పుబ ట్టారు. ఈ క్రమంలో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు పైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో కీలకమైన కృష్ణంరాజు కోసం వెతుకులాట ప్రారంభించారు.
ఈ పరిణామాలను ఉటంకిస్తూనే.. మహిళా కమిషన్ రాష్ట్ర డీజీపీకి లేఖ సంధించింది. మూడు రోజుల్లోగా ఆయా అంశాలపై తీసుకున్న చర్యలను కేసు వివరాలను కూడా తమకు అందించాలని స్పష్టం చేసింది. దీంతో పోలీసులు ఈ కేసును మరింత దూకుడుగా పరిశోధించే పనిని చేపట్టారు. ఈ కేసులో ఏ3గా సాక్షి మీడియా ఉన్న నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు.