రెండు మూడు వారాల మందు వరకు టాలీవుడ్లో ‘హరిహర వీరమల్లు’ గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. సోషల్ మీడియాలో కూడా ఆ సినిమా గురించి డిస్కషన్లు నడుస్తుండేవి. జూన్ 12న రిలీజ్ ఖాయం అనుకున్నంత వరకు అందరూ దాని గురించి మాట్లాడుతుండేవాళ్లు. వాయిదా వార్తలు వచ్చినపుడూ చర్చలు ఆ సినిమా చుట్టూ తిరిగాయి. కానీ తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. వాయిదా ఖాయమని తేలడం, కొత్త డేట్ ప్రకటించకపోవడంతో అభిమానులు ఉస్సూరుమన్నారు. కొత్త డేట్ గురించి నెమ్మదిగా ఊహాగానాలు కూడా ఆగిపోయాయి.
పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా పూర్తిగా ఉత్సాహం తగ్గిపోయింది. ఈ సినిమా వచ్చినపుడు చూద్దాం అన్నట్లుగా మౌనం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ గురించి అప్డేట్ ఇవ్వకుండా, రిలీజ్ గురించి మాట్లాడకుండా టీం ఏం చేస్తోందో ఎవరికీ అంతుబట్టలేదు. ఐతే ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ మౌనం వీడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌తో సరికొత్త పోస్టర్ వదలబోతోందట చిత్ర బృందం. అందుకు గురువారమే ముహూర్తం అని వార్తలు వస్తున్నాయి. ఒక స్ట్రైకింగ్ పోస్టర్‌తో డేట్ ప్రకటించోతున్నారట.
జూన్ 27, జులై 12, జులై 24.. ఇలా ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. లేటెస్ట్‌గా ప్రచారంలో ఉన్న డేట్ మాత్రం జులై 24యే. కానీ ‘కింగ్‌డమ్’ సినిమాకు జులై 25వ తేదీని ఫిక్స్ చేసినట్లుగా సితార కాంపౌండ్ నుంచి సమాచారం వస్తోంది. ఈ మేరకు ఓటీటీ సంస్థతో కూడా అంగీకారం కుదిరింది అంటున్నారు. మరి దానికి పోటీగా ‘హరిహర వీరమల్లు’ను వేస్తే ఇబ్బందే. మరి పవన్ కోసం సితార నాగవంశీ త్యాగం చేస్తాడా.. లేక పోటీకి సై అంటాడా అన్నది చూడాలి. ఇంతకీ జులై 24కే ‘వీరమల్లు’ ఫిక్స్ అయిందా లేదా అన్నది చూడాలి ముందు.