బాలీవుడ్లో ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు తర్వాతి కాలంలో విడిపోయాయి. ఈ జాబితాలోకి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూడా చేరబోతున్నట్లుగా చాన్నాళ్లుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ ఇద్దరూ బయట కలిసి కనిపించడం లేదు. పలు సందర్భాల్లో ఐశ్వర్య.. తన కూతురితో కలిసి మాత్రమే ఈవెంట్లలో పాల్గొంది.
ఇటు ఐశ్వర్య, అటు అభిషేక్ ఒకరి గురించి ఒకరు మాట్లాడ్డం దాదాపుగా మానేశారు. అలా అని ఇద్దరూ విడిపోయారా అంటే.. అలాంటిది జరిగితే అధికారికంగానే ప్రకటిస్తారు తప్ప దాచడానికి ఏమీ ఉండదు. బాలీవుడ్ మీడియా వర్గాలైతే ఇద్దరూ అధికారికంగా విడిపోలేదు కానీ.. విడిగా ఉంటున్నట్లుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఇలాంటి టైంలో అభిషేక్ బచ్చన్ పెట్టిన ఒక క్రిప్టిక్ పోస్టు వైరల్ అవుతోంది. తాను జనాలకు దూరంగా ఒంటరిగా ఉంటూ తన గురించి తనేంటో తెలుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఈ పోస్టులో పేర్కొన్నాడు అభిషేక్. ‘‘నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం సమయం కేటాయించుకోవాలనిపిస్తోంది. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలి’’ అని ఈ పోస్టులో అభిషేక్ పేర్కొన్నాడు.
‘కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అందరికీ దూరంగా ఉండాలి’ అంటూ ఈ ఇన్‌స్టా పోస్టుకు కామెంట్ కూడా జోడించాడు అభిషేక్. జూనియర్ బచ్చన్ ఇంత వైరాగ్యంతో మాట్లాడ్డానికి కారణమేంటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ‘‘నాకెంతో ఇష్టమైన వారికి నాకున్నదంతా ఇచ్చేశా’ అంటూ కామెంట్ చేయడం ఐశ్వర్యను ఉద్దేశించే అనే చర్చ కూడా జరుగుతోంది. ఆమెకు తన ఆస్తినంతా ఇచ్చేసి తాను ఒంటిరిగా బతకబోతున్నట్లుగా అభిషేక్ సంకేతాలు ఇచ్చాడని.. ఇది విడాకుల గురించి ఇండికేషన్ కావచ్చని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.