పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` మూవీ పార్ట్ 1 రిలీజ్ పై సస్పెన్స్ వీడింది. తాజాగా చిత్ర బంధం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. జూలై 24న హరిహర వీరమల్లు చిత్రం విడుదల కానున్నట్లు శనివారం ఉదయం అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో కొంత భాగానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. మరికొంత భాగాన్ని నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు.
ఈ సినిమాలో చారిత్రాత్మక యోధుడిగా పవన్ కనిపించబోతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇప్పటికే హరి హర వీరమల్లు రిలీజ్ అనేకసార్లు వాయిదా పడింది. అయితే ఈసారి మాత్రం విడుదలలో ఎటువంటి మార్పు ఉండదని అంటున్నారు.
కాగా గతంలో జూలై 24వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన `తొలిప్రేమ` విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `ఇంద్ర` మూవీ కూడా అదే తేదీలో వచ్చి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ క్రేజీ డేట్ పై వీరమల్లు కన్నేశాడు. హిట్ సెంటిమెంట్ రిపీటైతే బొమ్మ బ్లాక్‌బస్టరే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.