వైసీపీ అధినేత జగన్ సొంత ఛానెల్ సాక్షిని మూసేస్తారా? దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అమరావతిపై డిబేట్ సందర్భంగా అక్కడ మహిళలు ఆ తరహా వృత్తిలో ఉన్నారంటూ.. వ్యాఖ్యాత కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనంతరం.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం.. శనివారం కూడా.. ఉద్యమించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా పెట్టారు.
ఇక, ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సాక్షిపై చర్యలకు రంగం రెడీ అవుతోందని సమాచారం. దీనిపై జాతీయ స్థాయిలో మీడియా మేనేజ్మెంట్ వ్యవహారాలను చూసే ఎడిటర్స్ గిల్డ్ అదేవిధంగా శాటిలైట్ చానెల్ మేనేజ్మెంటుకు కూడా ఫిర్యాదు చేయాలనినిర్ణయించారు.
ప్రభుత్వం పరంగా.. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖకు కూడా లేఖ రాయనున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ప్రోత్సహించడం.. ఒక ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వంటివాటిని కేంద్రానికి వివరించనున్నారు. తద్వారా కేంద్రం నుంచి కూడా ఒత్తిడి తీసుకువచ్చి సాక్షి కి ఉన్న మీడియా లైసెన్సును కొన్నాళ్లపాటు సస్పెండ్ చేయడం లేదా.. పూర్తిగా రద్దు చేయాలన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.