రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక.. రాజకీయ భాషే మాట్లాడాలి కానీ.. సినిమా డైలాగులు కాదన్నారు. సినిమాల్లో మాత్రమే సినిమా డైలాగులు వినేందుకు బాగుంటుందన్నారు. బయట ప్రజలు ఉంటారని.. ప్రజాస్వామ్యం అంటూ ఒకటి ఉంటుందని వ్యాఖ్యానించారు. అక్కడ సినిమా డైలాగులు పనికిరావని అన్నారు.
లేదు-కాదు.. మేం సినిమా డైలాగులనే వాడతాం అంటే.. పోలీసులు చూస్తూ కూర్చోబోరని చెప్పారు. వారు కఠినంగానే వ్యవహరిస్తారని తెలిపారు. ఈ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు కూడా ఓ కంట కనిపెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. తాజాగా గుం టూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటించినప్పుడు.. ఆ పార్టీ కార్య కర్త ఒకరు.. “చంపేస్తాం.. నరికేస్తాం.. రప్పా రప్పా“ అనే పోస్టర్ను ప్రదర్శించారు.
ఇది పుష్ప-2 సినిమాలోని డైలాగ్. ఈ వ్యాఖ్యలు.. తీవ్ర వివాదం అయ్యాయి. అయితే.. దీనిని ఖండించాల్సి న వైసీపీ అధినేత జగన్ సమర్థిస్తూ మాట్లాడారు. పైగా తప్పులేదన్నట్టు వ్యాఖ్యానించారు. టీడీపీ వాళ్లను చంపేస్తామంటే తప్పేముందన్నారు. ఈ వ్యాఖ్యలు సైతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రమే స్పందించారు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పం దిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. సదరు వ్యాఖ్యలు చేసిన రాజేష్ అనే యువకుడితోపాటు పది మందికి పైగా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ ఓ వంట మాస్టర్ వద్ద కుక్‌గా పనిచేస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. జగన్ అంటే అభిమానమని.. ఈ నేపథ్యంలోనే అలాంటి బ్యానర్ పట్టుకున్నాడని చెప్పారు.