ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ తీరాన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 3.3 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొన్నారని.. ఈ కార్యక్రమం ద్వారా రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించామని చంద్రబాబు పేర్కొన్నారు.
అలాగే ఈ సందర్భంగా యోగాంధ్ర పై విమర్శలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. యోగాంధ్ర అంటూ ప్రజాధనం వృధా చేస్తున్నారని జగన్ ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై బాబు రియాక్ట్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా వేస్ట్.. నాడు రిషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం వందల కోట్లను ఖర్చు చేసిన వ్యక్తులు నేడు ఇటువంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ చంద్రబాబు కౌంటర్ వేశారు.
యోగా అనేది ప్రజల ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతకు ఎంతో మేలు చేస్తుందని.. అటువంటి యోగా ప్రాముఖ్యత చెప్పేందుకు ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తే అనవసరంగా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం కోసం రూ. 75 కోట్లు కేటాయించిందని.. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.