“ఎవరు చేసుకున్న ఖర్మ వారిని పట్టిపీడిస్తుంది.. జగనన్నా!“ అని ఒకరంటే.. “చేసుకున్న వారికి చేసుకున్నంత“ మరొకరు వ్యాఖ్యానించారు. ఇలా.. వందల కొద్దీ నెటిజన్లు..జగన్‌పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది జోరుగా మారింది. తాజాగా జగన్ తన ఎడమచేతి ఉంగరం వేలికి ఓ రింగు పెట్టుకుని కనిపించిన విషయం తెలిసిందే. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పరోక్షంగా ఈ రింగును అందరికీ కనిపించేలా పదే పదే ఎడమ చేతిని గాలిలోకి ఊపుతూ.. తన రింగును ప్రదర్శించారు. సాధారణంగా జగన్ బంగారు ఆభరణాలకు దూరం.
అయితే.. ఆయన ఎడమచేతికి మాత్రం ఖరీదైన వాచీ ఉంటుంది. ఇంతకు మించి.. చేతిలో సెల్ ఫోన్ కూడా ఉండదు. అసలు ఆయన ఎప్పుడూ ఫోన్ మాట్లాడినట్టుగా కూడా కనిపించరు. అయితే.. తాజాగా చేతికి రింగు పెట్టుకోవడం.. అది పూర్తిగా సీఎం చంద్రబాబు పెట్టుకునే హెల్త్ ట్రాక్ రింగును పోలి ఉండడంతో అందరి దృష్టీ దీనిపైనే పడింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడే ఈ రింగును పెట్టుకున్నారు. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించిన ప్పుడు.. తన ఆరోగ్య భద్రతలో భాగంగా ఇంట్లో వారు.. దీనిని తనకు ఇచ్చారని.. తన ఆరోగ్యాన్ని నిరంతరం ఈ రింగు ట్రాక్ చేస్తుందని చెప్పారు.
అయితే.. అప్పట్లో సీఎంగా ఉన్న జగన్.. దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఆయన చిప్‌ను చేతిలో పెట్టుకుని రింగులో పెట్టారు. కానీ, చిప్ ఉండాల్సింది.. మెదడులో.. గుండెల్లో!“ అని వెటకారంగా మాట్లాడారు. అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. అదే చిప్.. ఇప్పుడు జగన్ చేతికి వచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఖర్మ అంటే.. ఇదే జగనన్నా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత పాత వీడియోలను కొందరు వైరల్ చేస్తున్నారు. సీన్ రిపీట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై జగన్ ఎలా స్పందిస్తారోచూడాలి. ప్రస్తుతం పాత వీడియో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.