అమరావతి మహిళలు సంకరజాతి వారు అంటూ వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు,మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అమరావతి మహిళల గురించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సజ్జలపై కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా సజ్జల వ్యాఖ్యానించారని ఆరోపించారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన తాడేపల్లి పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.
మరోవైపు, తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. అయితే, సజ్జలకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దంటూ శిరీష తరఫు లాయర్ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.