ఉదయం 5.30 గంటలు. అప్పుడప్పుడే.. నిద్రలేస్తున్న ప్రజలకు ఊహించని విధంగా “గుడ్ మార్నింగ్.. ఎలా ఉన్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? పింఛను అందుతోందా?.. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? “ అంటూ.. ఎమ్మెల్యే పలకరింపు!. దీంతో ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో గత కొన్నాళ్లుగా జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్.. ప్రజలకు చేరువ అవుతున్నారు.
సాధారణ ప్రజల విషయాన్ని చూస్తే.. అనేక సమస్యలు వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. వారి సమస్యలు చెప్పుకొనేందుకు ఎవరూ చొరవ చూపించరు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేను కలుసుకుని తమ గోడు వినిపించాలని అనుకుంటే.. ఎక్కడో ఉన్న ఆయన ఆఫీసుకువెళ్లి.. గంటల తరబడి వెయిట్ చేసి.. సమస్యలు చెప్పుకొనే పరిస్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ సమస్యను గ్రహించిన కంది కుంట.. తనే ప్రజలకు చేరువ అవుతున్నారు.
గుడ్ మార్నింగ్ కదిరి-పేరుతో రెండు మాసాల నుంచి ఆయన ప్రజల మధ్యే ఉంటున్నారు. ఉదయం 5 గంటలకే లేచి.. ముందుగానే నిర్దేశించుకున్న వార్డులు, మండలాల్లో పర్యటిస్తున్నారు. ఇలా.. ఉదయం 9 గంటల వరకు స్వయంగా ఆయన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అంతేకా దు.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడంతో పాటు.. వారికి చేరువగా ఉంటున్నారు.
ఎమ్మెల్యే చొరవతో ప్రజలు ఖుషీ అవుతున్నారు. ఇక, తాజాగా వెలుగు చూసిన రెండు సర్వేల్లోనూ ఎమ్మెల్యే గ్రీన్ జోన్‌లో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 64 శాతం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇలా.. కదిరి ఎమ్మెల్యే ప్రజల మనసు చూరగొనడం.. వారికి చేరువగా ఉండడం వంటివి కలిసి వస్తున్నా యి. గతంలో ఒకసారి విజయం దక్కించుకున్న కందికుంట వరుస పరాజయాలు చవి చూశారు. తాజా పరిణామంతో ఇక, ఆయనకు వరుస విజయాలేనన్న టాక్ వినిపిస్తుండడం గమనార్హం.